కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల పదిహేను నిమిషాల ఫుటేజ్ తీసి అందులో గంట లేపేస్తే కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత మీద చాలా భారం పడుతుందని, సినిమా ఫలితం ఎవరి చేతిలో లేకపోయినా, కనీసం ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇలా తీసే వాళ్ళను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని, ఇలాంటి వాళ్ళు క్రిమినల్స్ తో సమానమని ఘాటుగా విమర్శించారు. ఆయన వాడింది చాలా పెద్ద పదమే.

కోన వెంకట్ ప్రత్యేకంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా ఈ ఏడాదిలోనే దక్షిణాది నుంచి వచ్చిన నాలుగు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు మూవీ లవర్స్ ఈ కామెంట్స్ ముడి పెడుతున్నారు. వీటిలో ఏదీ యునానిమస్ బ్లాక్ బస్టర్ కాలేదు. చివరి దశ వరకు ఒత్తిడిని చూసుకుంటూ, లెన్త్ విషయంలో ఇబ్బందులు పడుతూ, ఎడిటర్ కు నరకం చూపించినవే. వందల కోట్ల పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు చేసినవే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కోన ఇలా అని ఉండొచ్చు.

క్రిమినల్స్ అనేది తీవ్రమైన మాటే కానీ ఇక్కడ ఆలోచించాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. ఒకప్పటిలా నెగటివ్ రీల్స్ వాడే ప్రయాస లేకుండా మొత్తం డిజిటల్ కావడంతో దర్శకులకు ఎక్కువ ఫుటేజ్ తీసే అలవాటు పెరిగిపోయింది. దీని వల్ల ఇతర ఖర్చులు పెరిగి నిర్మాతకు గుదిబండగా మారుతోందనే నిజాన్ని వాళ్ళు గుర్తించడం లేదు. ఈ ధోరణి ప్రతిసారి నష్టమే తేకపోవచ్చు. కొన్నిసార్లు ప్రయోజనం కూడా కలిగిస్తుంది. కొన్ని కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఈ ప్రాసెస్ చాలా మేలు చేసింది.

ఈ పోకడని తగ్గించాలంటే ఒకటే మార్గం. స్క్రిప్ట్ ఫైనల్ చేయడం దగ్గరి నుంచి లొకేషన్ హంట్ దాకా సెట్స్ కు వెళ్ళడానికి ముందే ప్రతి ఒకటి పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకోవడం. ఒక్కసారి కెమెరా ఆన్ చేశాక డైలాగు నుంచి షూట్ ప్రాపర్టీ దాకా ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా రోజుకో మార్పు చేసి హీరోని నిర్మాతని విసిగించే అలవాటు మానుకోవాలి. అప్పుడే పొదుపు ఆరంభమవుతుంది. లేదంటే ఎందరు ఎన్నిసార్లు చెప్పినా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. కాస్ట్ పెరుగుతూనే పోతుంది.