వారణాసిలో ఒక కొత్త భాష

కొన్ని సినిమాల్లో సందర్భానుసారం మనకు పరిచయం లేని భాషలు మాట్లాడుతుంటాయి పాత్రలు. కానీ ఒక సినిమా కోసం కొత్త భాషనే క్రియేట్ చేయడం అన్నది భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’ సినిమాకు మాత్రమే జరిగి ఉంటుందేమో. అందులో రాక్షసావతారంలో కనిపించే కాలకేయులు.. కిలికి అనే చిత్రమైన భాష మాట్లాడతారు.

ఐతే కాలకేయులతో ఏదో నోటికొచ్చింది మాట్లాడించేయకుండా.. ఆ భాషకు ఒక లిపి కూడా క్రియేట్ చేశారు మేకర్స్. తమిళంలో ఈ సినిమాకు డైలాాగ్స్ రాసిన మదన్ కార్కి ఈ పని చేశాడు. ఇప్పుడు రాజమౌళి తన కొత్త సినిమా ‘వారణాసి’కి కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. ఇందులో కూడా కొన్ని చిత్రమైన పాత్రలు ఉంటాయట. అవి ఒక కొత్త భాష మాట్లాడతాయట. ‘బాహుబలి’ కోసం చేసినట్లే ఈ భాషకు కూడా ఒక ఫార్మాట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందట.

‘వారణాసి’ కోసం ఒక భాషా నిపుణుడిని నియమించిందట చిత్ర బృందం. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ కథలో హీరో సహా కొన్ని పాత్రలు తమ ప్రయాణంలో రకరకాల కాలమానాల్లో ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో ఒక పర్టికులర్ టైం లైన్లో ఒక గుహలోకి పాత్రలు ప్రవేశించినపుడు గోడల మీద ఒక ప్రాచీన లిపిలో రాతలు ఉంటాయి. వాటిలో దాగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలంటే… ముందుగా ఆ లిపిని, ఆ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ సన్నివేశాల కోసం భాషా నిపుణుడితో ఒక ప్రత్యేకమైన లిపి, వ్యాకరణం, వాక్య నిర్మాణం.. ఇవన్నీ చేయించారట. ఈ సన్నివేశంలో ఏవో పిచ్చి గీతలు గీసి.. అదే ఒక భాష అని చెప్పేయొచ్చు. కానీ పర్ఫెక్షన్‌కు మారుపేరైన రాజమౌళి.. ‘బాహుబలి’ తరహాలోనే ఈ సినిమాకు కూడా కొత్త భాష, లిపి తయారు చేయిస్తున్నాడు. ఇలా చేయడం రాజమౌళికే సాధ్యం అని ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.