ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే. ఎంత త్వరగా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామో అంతే వేగంగా విజయాలు అందుకునే దారి దొరుకుతుంది. కానీ టాక్సిక్ ఫలితం తేలిపోయాక యష్ బయట కనిపించడమే మానేయడం ఫ్యాన్స్ కవర్ చేసుకోలేకపోతున్నారు. కన్నడలో రికార్డులు సృష్టిస్తున్న ప్రేమద ఊరల్లీ అనే చిన్న సినిమాను మెచ్చుకుంటూ ఒక ట్వీట్ అయినా పెట్టకపోవడం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
అలా చేయాలని రూల్ లేకపోయినా యష్ తరచు మీడియాలో కనిపించే అలవాటుని ఇప్పుడు పూర్తిగా మానేయడాన్ని శాండల్ వుడ్ వర్గాలు తప్పు బడుతున్నాయి. టాక్సిక్ పోయింది. నిజమే. కంటెంట్ అస్సలు బాలేదు. ఒప్పుకుందాం. ఇది అందరికీ అనుభవమే. ఏదో తనకు మాత్రమే ఎదురైనట్టు ఇలా మొహం చాటేయడం గురించి కామెంట్స్ రావడాన్ని ఎవరూ ఖండించలేరు. ఇప్పటికీ టాక్సిక్ కన్నడ, తెలుగు భాషల ఓటిటి డీల్ కాలేదని బెంగళూరు టాక్. చాలా తక్కువ రేట్ ఆఫర్ చేయడం వల్లనట.
సరే ఇదంతా గడిచిపోయిన గతం కాబట్టి ఇక వర్తమానానికి వద్దాం. రామాయణ పార్ట్ 1 విడుదల ఇంకో 27 రోజుల్లో ఉంది. నాలుగు వేల కోట్లతో తీశామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పిన మాటల్లో ఎంత నిజముందో తెలియడానికి ఇంకొక్క నెల ఆగితే క్లారిటీ వస్తుంది. అయితే ప్రమోషన్లు ఒకపక్క జరుగుతున్నా, రన్బీర్ కపూర్, సాయిపల్లవి బయట ఈవెంట్లలో కనిపిస్తున్నా ఎక్కడా రాకింగ్ స్టార్ యష్ దర్శనం లేదు. బహుశా చివరి దశలో వస్తాడేమోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
రామాయణలో యష్ చేసింది ఆషామాషీ పాత్ర కాదు. రావణుడి క్యారెక్టర్. ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు తను ముందుకు రావడం చాలా అవసరం. ఇన్ సైడ్ టాక్ మరొకటి ఉంది. మొదటి భాగంలో రావణుడు, ఆంజనేయుడు పాత్రలకు తక్కువ నిడివి ఉంటుందని, ఈ ఇద్దరినీ సీక్వెల్ లో ఎక్కువగా వాడారని అంటున్నారు. అయితే నటుడిగా కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా యష్ రామాయణలో కీలక భూమిక పోషిస్తున్నాడు. సో మీడియా కెమెరా ముందుకు రాక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates