కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ఇదే అంటున్నాడు. కరెంటు లేని రోజులే చాలా బాగుండేవని.. ఇప్పుడు కూడా మళ్లీ ఆ రోజులు రావాలని అనిపిస్తోందని తన కొత్త చిత్రం ‘రణబాలి’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

తన వాదనేంటంటే.. ‘‘విద్యుత్ అనేది లేకుంటే బాగుండు అనిపిస్తుంది. అది లేనపుడే జనాలు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారు. వాస్తవ రూపంలో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కానీ.. అది లేని రోజులు బాగుండేవి. రాత్రిపూట మంటతో దీపాలు వెలిగించుకునేవారు. వాటిని ఆపేసి రాత్రి 7 గంటలు అవ్వగానే అందరూ పడుకునేవారు. తెల్లవారుజామున కోడి కూసే వేళకు నిద్ర లేచేవాళ్లు. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఆ సైకిల్ డిస్టర్బ్ అయింది ఎలక్ట్రిసిటీ వల్లే. త్వరగా పడుకోవడం ఆపేశారు’’ అని రాహుల్ వివరించాడు.

మరోవైపు ఈ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సాంకేతికత వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ, మనిషి పరుగు ఆగితేనే సంతోషంగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇంకొకరితో పోల్చుకోవడమే అతి పెద్ద సమస్య అని అతనన్నాడు. ‘రణబాలి’ షూటింగ్ జరిగేటపుడు.. చిన్న గ్యాప్ వస్తే పక్కన షూటింగ్ కోసం తీసుకొచ్చిన గుర్రాలు కనిపించాయని, ఆలోచిస్తే వాటి జీవితమే బాగుంది కదా అనిపించిందని విజయ్ అన్నాడు.

ఆ గుర్రాలకు తినడం, పరుగెత్తడం తప్ప ఇంకేమీ పని లేదని..కానీ మనం మాత్రం ఇంకొకరితో పోల్చుకుంటూ.. వాడి కంటే పెద్ద ఇల్లు కట్టాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి అని పరుగులు పెడుతూ ఉన్నామని.. అభివృద్ధి వల్ల సౌకర్యాలు పెరిగినప్పటికీ, ప్రశాంతత పోయిందని విజయ్ అన్నాడు. జీవితాన్ని అన్‌కండిషనల్‌‌గా ఆస్వాదించడంలోనే ఆనందం ఉందని విజయ్ అభిప్రాయపడ్డాడు. విజయ్, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘రణబాలి’ దసరా కానుకగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.