ఇండియాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హోంబలే ఫిలిమ్స్‌కు గొప్ప పేరు, డబ్బు తెచ్చిపెట్టిన సినిమా కాంతార. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. కాంతారతో సెన్సేషన్ క్రియేట్ చేశాక ఇంకా భారీ స్థాయిలో కాంతార:ది చాప్టర్-1 తీసి ఇంకా పెద్ద విజయాన్నందుకున్నారు రిషబ్, హోంబలే అధినేతలు.
కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. రిషబ్, హోంబలే అధినేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలల ముందు రిషబ్, అతడి భార్య.. సోషల్ మీడియాలో హోంబలే సంస్థను అన్ ఫాలో చేయడం చర్చనీయాంశం అయింది. ఐతే అదేదో చిన్న మిస్ కమ్యూనికేషనేమో అనుకున్నారంతా. కానీ గొడవ పెద్దదే అని ఇప్పుడు స్పష్టమవుతోంది.
నిన్న కాంతార సినిమాకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రిషబ్ శెట్టి ఒక పెద్ద పోస్టు పెట్టాడు. కానీ అందులో ఎక్కడా హోంబలే సంస్థ ప్రస్తావన తీసుకురాలేదు. ఫొటోల్లోనూ హోంబలే పేరు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత హోంబలే సంస్థ కూడా కాంతార యానివర్శరీ పోస్టు పెట్టింది. అందులో రిషబ్ పేరు కనిపించలేదు. పోస్టర్లో కూడా రైటర్ కమ్ డైరెక్టర్‌గా రిషబ్ పేరు ప్రస్తావన రాకుండా చూసుకున్నారు. ఫొటో కూడా రిషబ్‌ను గుర్తుపట్టని విధంగా కాంతార అవతారంలో ఉన్నది వాడారు. ఈ ఒరవడి తర్వాతి రోజు కూడా కొనసాగింది.
కాంతార:చాప్టర్-1 యానివర్శరీ పోస్టుల్లో రిషబ్ ఇంకా పెద్ద పోస్టు పెట్టి అందులోనూ హోంబలేను అవాయిడ్ చేశాడు. హోంబలే వాళ్లయితే దీనికి కౌంటర్‌గా ఒక పులి చిత్రం ఉన్న పోస్టర్‌తో యానివర్శరీ పోస్టు పెట్టారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన హీరో కమ్ డైరెక్టర్ ఫొటో లేకుండా పోస్టర్ వదలడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసి హీరో కమ్ డైరెక్టర్, నిర్మాతల మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడం అనూహ్యం. ఈ గొడవ చూస్తుంటే కాంతార-3 వస్తుందా అన్నది అనుమానంగానే ఉంది. ఒకవేళ రిషబ్ ఆ సినిమాను మొదలుపెట్టినా.. హోంబలే నుంచి అభ్యంతరాలు తప్పవేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates