పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు వచ్చినా ఓవర్సీస్, ఉత్తరాదిలో ఫ్లాప్ చవి చూడటం వాళ్ళు ఊహించలేదు. అందులోనూ వివిధ నగరాల్లో ఈవెంట్లు, ప్రెస్ మీట్లు చేశారు. చేతికి గాయంతోనే చరణ్ దేశమంతా తిరిగాడు. అయినా లాభం లేకపోయింది. ఒకవేళ దర్శకుడు బుచ్చిబాబు అంచనాలు కనక అందుకుని ఉంటే ఫైనల్ గ్రాస్ మాటలకందని పెద్ద నెంబర్ వచ్చేది.
సరే ఇదంతా గతం. పదే పదే తలుచుకుని లాభం లేదు. వర్తమానంలోకి వస్తే సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ తీయబోయే భారీ చిత్రం దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 నుంచి 20 మధ్యలో ఒక మంచి డేట్ చూసి ఓపెనింగ్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదట. తేదీ ఫిక్స్ కాగానే చిరంజీవి లాంటి అతిథుల అందుబాటుని చెక్ చేసుకుని త్వరలోనే మీడియాకు సమాచారం ఇవ్వబోతున్నారు. సో ఫ్యాన్స్ పరంగా ఒక సస్పెన్స్ తీరింది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ సినిమా ఎంత కాలం తీస్తారనేది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పుష్ప తరహాలో సంవత్సరాలు తీసుకోకుండా రంగస్థలం మోడల్ లో తక్కువ టైంలో తీయాలని సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. స్క్రిప్ట్ లాకైపోయిందని, ప్రతి సీన్ ఆయన దగ్గరుండి చెక్ చేసుకుని ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకున్నారని టాక్. పుష్ప తర్వాత తన నుంచి వస్తున్న మూవీ కావడంతో దక్షిణాదిలోనూ డిమాండ్ ఉంటుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
వచ్చే ఏడాది ఇదే సమయానికి షూటింగ్ పూర్తి చేసే సాధ్యాసాధ్యాలను సుకుమార్ బృందం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ నుంచి ఇదే తంతు. పెద్ది కూడా రెండేళ్లు తినేసింది. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం అవసరం లేకుండా తన స్టయిల్, మేకింగ్ మిస్ కాకుండా పొదుపు మార్గాల మీద సుకుమార్ దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇది నిజంగా జరిగితే అంత కన్నా గుడ్ న్యూస్ మూవీ లవర్స్ కు ఏముంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates