శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ చిన్న సినిమాకు జాక్ పాట్ అనే చెప్పాలి. ఈ టైటిల్ చూసి ముందు అందరూ ఇదేదో సీరియస్ మూవీ అనుకున్నారు. ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు.. మళ్లీ పాత రూట్లోకి ఎందుకు వెళ్తున్నాడు అని తన ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు.

కానీ ఇది పక్కా కామెడీ సినిమానే అని ఆ మధ్య రిలీజైన టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఫుల్ ఫన్ మోడ్‌లో సాగడంతో శ్రీ విష్ణు నుంచి ఎంటర్టైనర్స్ ఆశించే ప్రేక్షకుల్లో ఉత్సాహం వచ్చింది. కొత్త దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ రూపొందించిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం మంచి హైప్‌తోనే రిలీజ్ కాబోతోంది.

ఐతే ప్రోమోలు బాగున్నాయి, బజ్ ఓకే కానీ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’కు సంబంధించి ఒక్క విషయంలోనే కొంచెం సందేహాలున్నాయి. ఇది నక్సలిజం చుట్టూ తిరిగే పీరియడ్ మూవీ. అది సీరియస్, సెన్సెటివ్ టాపిక్. అందులో కామెడీ చేయడం అన్నది కత్తి మీద సాము లాంటిదే. ‘జల్సా’ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో త్రివిక్రమ్ నక్సలిజం మీద సీరియస్‌గా డిస్కస్ చేయడం మొదలుపెట్టి.. చివరికి ఆ ఎపిసోడ్ మధ్యలో కామెడీ చేయబోతే ఆ ఎపిసోడ్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ విషయానికి వస్తే.. ఇందులో నక్సలిజం పార్ట్ ఫుల్ లెంగ్త్‌లోనే ఉండబోతోందని అర్థమవుతోంది. హీరోను నక్సలైట్‌గా చూపించి, టైటిలే ‘కామ్రేడ్ కళ్యాణ్’ అని పెట్టేశారు. కానీ సినిమానేమో పూర్తి వినోదాత్మకంగా నడిపించినట్లున్నారు. సినిమాకు ‘LOLSalaam’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం గమనార్హం.

కానీ నక్సలిజం మీద కామెడీ చేస్తే.. దాని మీద విమర్శలు రావా, వివాదాలు చెలరేగవా.. ప్రేక్షకులు దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారా అన్నది డౌట్. కాబట్టి ఈ సబ్జెక్టును కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం కీలకం. మరి ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకర్స్ ఈ విషయంలో ఎలా బ్యాలెన్స్ చేశారో?