కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. గత నెల కన్నడలో విడుదలైన ‘ప్రేమద ఊరల్లీ’ అనే చిన్న మూవీ కర్ణాటకలో రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో వసూళ్లు తెస్తోంది. చిన్న సెంటర్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పెడుతూ పిల్లా పెద్ద అందరినీ తనవైపు లాగేస్తోంది. మెయిన్ సెంటర్స్ లో టికెట్లు సులభంగా దొరకనంతగా దూసుకుపోతున్న వైనం ఇండస్ట్రీ పెద్దలను షాక్ కి గురి చేసింది.
అలాని ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఉన్నారనుకుంటే పొరపాటే. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని నేపధ్యంగా తీసుకుని ఒక చిన్న ఊరిలో నడిపించిన ఎమోషనల్ డ్రామా జనాన్ని కట్టిపడేస్తోంది. శాండల్ వుడ్ సెలబ్రిటీలు ఒక్కొకరుగా ఈ చిత్రాన్ని చూసి తమ వంతుగా మరింత మద్దతు అందజేయడం కలెక్షన్లు పెంచుతోంది. దర్శకుడు మనోజ్ కుమార్ పేరు అక్కడ మారుమ్రోగుతోంది. ఇప్పటికే యాభై కోట్ల మార్కు దాటేయగా సెంచరీ క్లబ్బులో చేరడం చాలా సులభంగా కనిపిస్తోంది.
విచిత్రం ఏమిటంటే ఈ ప్రేమద ఊరల్లిని తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో డబ్బింగ్ చేసి మొన్న గాంధీ జయంతికి రిలీజ్ చేశారు. హైదరాబాద్ లాంటి చోట్ల ఒకటి రెండు మల్టీప్లెక్సుల్లో తప్ప మిగిలిన చోట్ల సరైన ఆదరణ కనిపించడం లేదు. చూసిన టాలీవుడ్ ఆడియన్స్ అంత గొప్పగా ఏమి లేదని, సీరియల్ తరహా ఫీలింగ్ కలిగించిందని అన్నారు. అంటే కన్నడ జనాలకు కనెక్ట్ అయిన భావోద్వేగం మనోళ్లకు రీచ్ కాలేదంటే కారణం నేటివిటీ తప్ప మరొకటి కాదు.
మనం సింహాసనం అందించిన బలగం ఇతర భాషల్లో రీమేక్ కాలేదు. ఎందుకంటే తెలంగాణ కథలోని ఆత్మని తెలుగోళ్లు సొంతం చేసుకోగలరు కానీ ఇతరులు కాదు. ఇప్పుడు ప్రేమనే ఊరిలో కూడా అదే బాపతులోకి వస్తోంది. సోషల్ మీడియాలో థియేటర్ రెస్పాన్స్, ఆడియన్స్ తండోపతండాలుగా వస్తున్న వీడియోలు బాగా వైరలవుతున్నాయి. మన దగ్గర కనీస స్థాయిలో పబ్లిసిటీ చేయకపోవడం కూడా ఒక లోపమనే చెప్పాలి. అయినా అన్నీ కాంతార, కెజిఎఫ్ లాంటి ఫలితాలు ఇవ్వవుగా.
Gulte Telugu Telugu Political and Movie News Updates