వింటేజ్ సినిమాలను వృథా చేయకండి

పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల గొప్పదనం కళ్లారా తెలుసుకుంటారు. యూట్యూబ్ లో ఎంత ఉచితంగా దొరికినా సరే బిగ్ స్క్రీన్ మీద చూసే ఎక్స్ పీరియన్స్ వేరు కాబట్టి దాని కోసమే వెళ్లే మూవీ లవర్స్ వేలల్లో కాదు లక్షల్లో ఉంటారు. కానీ వీటికీ సరైన ప్లానింగ్ అవసరం. లేదంటే ఏ ఉద్దేశంతో విడుదల చేశారో అది నెరవేరకుండానే వృథా అయిపోతాయి. ఆడియన్స్ కి చేరకుండానే సెలవు తీసుకుంటాయి.

ఇటీవలే వచ్చిన గీతాంజలి దానికి మంచి ఉదాహరణ. ఒకవైపు రామాయణ, సీన్ బాగా నడుస్తున్న టైంలో థియేటర్లకు తీసుకొచ్చారు. కొత్త రిలీజులు డిఎన్కె. ఇట్లు అర్జునలు ప్రచారంతో హోరెత్తించి పెద్ద ఎత్తున స్క్రీన్లు బ్లాక్ చేసుకున్నాయి. దీంతో మొక్కుబడిగా దొరికిన కొన్ని షోలతోనే నాగార్జున సినిమా సర్దుకుంది. ఫలితంగా గీతాంజలి లాంటి సిల్వర్ స్క్రీన్ మేజిక్ ని అందరూ ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్ లో అంతో ఇంతో డిమాండ్ ఉన్నా పూర్తి స్థాయి షోలు ఇవ్వలేకపోయారు.

ఇప్పుడు ముఠామేస్త్రి వంతు వచ్చింది. ఇది కూడా ఇంచుమించు ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయనుంది. ఈ నగరానికి ఏమైంది రిపీట్ కి మంచి టాక్ వచ్చింది. ఆకాశంలో ఒక తార బాగుందని అంటున్నారు. ఓమ్ కు ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ బాగున్నాయి. ఇవన్నీ ఆదివారం వరకు బలంగా జనాన్ని లాగుతాయి. సరిగ్గా అదే రోజు చిరంజీవి మాస్ క్లాసిక్ ముఠామేస్త్రిని విడుదల చేస్తున్నారు. వాటి మధ్య ఎన్ని షోలు దొరుకుతాయో, ఏ మేరకు కలెక్షన్లు లాగుతాయో వేరే చెప్పనక్కర్లేదు.

నిజానికి ముఠామేస్త్రి రెండు నెలల క్రితమే రావాల్సింది. కానీ ఇదే తరహా కాంపిటీషన్ వల్ల వాయిదా వేసుకున్నారు. ఇప్పుడూ పరిస్థితిలో మార్పు లేదు కానీ ఏదైనా పెద్దగా పోటీ లేని శుక్రవారం చూసుకుని ఉంటే బాగుండేది. గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి, శివ లాంటివి పర్ఫెక్ట్ టైమింగ్ తో వచ్చి మంచి కలెక్షన్లు జేబులో వేసుకున్నాయి. ఆ స్ట్రాటజీ లేక 7జి బృందావన్ కాలనీ, తొలిప్రేమ, కృష్ణ, సమరసింహారెడ్డి లాంటివి కెపాసిటీకి తగ్గట్టు ఆడలేక రీ రిలీజ్ ఫ్లాప్స్ గా మిగిలాయి. అందుకే టైమింగ్ ప్రధానం.