ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా.. ద‌ర్శ‌కుడి సారీ

ఒక సినిమా పెద్ద హిట్ట‌యితే.. అందులో లోపాలున్నా స‌రే, స‌క్సెస్‌లో కొట్టుకుపోతాయి. టీంలో ఎవ్వ‌రూ వాటి గురించి మాట్లాడ‌రు. సంబ‌రాల్లో మునిగిపోతారు. కానీ దస‌రా సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం అలా చేయ‌లేద‌ట‌. తాను ఆ సినిమాను అనుకున్నంత బాగా తీయ‌లేక‌పోయాన‌ని హీరో నాని ద‌గ్గ‌రికి వ‌చ్చి సారీ చెప్పాడ‌ట‌. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్.. మూడేళ్ల ముందు ద‌స‌రాతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

తొలి చిత్రంతోనే అత‌ను గురువుకు త‌గ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి నానిని టైర్ హీరోల్లో టాప్‌లో నిల‌బెట్టింది. అత‌డికి మాస్‌లో రీచ్‌ను పెంచింది. కాక‌పోతే సినిమా పెద్ద హిట్ట‌యినా స‌రే.. ద‌స‌రాలో కొన్ని లోపాలున్నాయ‌న్న‌ది వాస్త‌వం. టాక్ కొంచెం మిక్స్‌డ్‌గానే వ‌చ్చింది కూడా. ఐతే ద‌స‌రా పెద్ద హిట్ట‌యింది క‌దా అని త‌న వైపు నుంచి జ‌రిగిన త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ట శ్రీకాంత్.

త‌న‌తో పాటు అంద‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టామ‌ని ఆనందంలో ఉంటే.. శ్రీకాంత్ వ‌చ్చి తాను సినిమా అనుకున్నంత బాగా తీయ‌లేక‌పోయాన‌ని సారీ చెప్ప‌డం త‌న‌కు షాకింగ్ అని నాని ది ప్యార‌డైజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కొన్ని స‌న్నివేశాల‌ను బాగా రాసుకున్న‌ప్ప‌టికీ.. అనుకున్నంత బాగా ప్రెజెంట్ చేయ‌లేక‌పోయాన‌ని.. ఇంకా బెట‌ర్‌గా సినిమా తీసి ఉండాల్సింద‌ని శ్రీకాంత్ త‌న‌తో చెప్పిన‌ట్లు నాని తెలిపాడు.

శ్రీకాంత్ నిజాయితీగా అలా త‌న లోపాల గురించి మాట్లాడ‌డం త‌న‌కెంతో న‌చ్చింద‌ని, అప్పుడే త‌ర్వాత చేయ‌బోయే సినిమాలో ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని అన‌డంతో తెలియ‌కుండానే అత‌డితో ఇంకో సినిమాకు క‌మిటైపోయిన‌ట్లు అయింద‌ని.. అలా ది ప్యార‌డైజ్ ప్ర‌యాణం మొద‌లైంద‌ని నాని చెప్పాడు. మ‌రి ద‌స‌రాలో లోపాలున్న‌ట్లు గుర్తించి నిజాయితీగా ఆ విష‌యాన్ని నాని ద‌గ్గ‌ర ఒప్పుకున్న శ్రీకాంత్.. త‌న రెండో సినిమా విష‌యంలో అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ప‌ర్ఫెక్ట్ సినిమా అందిస్తాడేమో చూడాలి. ది ప్యార‌డైజ్ వ‌చ్చే గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.