సీన్ విలన్ కొత్త సినిమాకి ఇలాంటి రెస్పాన్సా

రెండు వారాల క్రితం విడుదలైన సీన్ తెలుగులోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది. హీరోగా సూర్యకి ఎంత పేరు వచ్చిందో అంతే ఫేమ్ విలన్ గా చేసిన మలయాళం యువ నటుడు ‘ప్రేమలు’ నస్లేన్ కూడా దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో కొందరు ఏకంగా ఇతని యాక్టింగ్ వల్లే సీన్ సక్సెస్ అయ్యిందని ఎలివేషన్లు ఇచ్చారు. దీని మీద ఆన్ లైన్ డిబేట్స్ కూడా జరిగాయి.

అదే నస్లేన్ కొత్త మూవీ ‘బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్’ ఇవాళ కేరళతో పాటు ఏపీ తెలంగాణలోనూ థియేటర్లలో అడుగు పెట్టింది. విచిత్రంగా దీని మీద అసలు బజ్ లేదు. వచ్చిన సంగతే జనాలకు గుర్తు రానంతగా కనీస ప్రమోషన్లు చేయలేదు. పధ్నాలుగు సంవత్సరాల క్రితం 2012లో వచ్చిన బ్యాచిలర్ పార్టీకి కొనసాగింపుగా ఇప్పుడీ మూవీ తీశారు. అమల్ నీరద్ దర్శకత్వం వహించగా కుంచకో బోబన్, సాబిన్ సాహిర్ లాంటి క్యాస్టింగ్ ఉంది. ఈ నగరానికి ఏమైంది రిపీట్ హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు.

తీరా చూస్తే బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్ పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. బంగారం స్మగ్లింగ్ చేసే కుర్రాళ్ళ గ్యాంగ్ అనుకోకుండా ఒక ప్రమాదంలో పడుతుంది. స్నేహానికి ప్రాణమిచ్చే ఈ బృందంలో హీరో కూడా ఉంటాడు. అయితే అనూహ్యంగా ఎదురైన చిక్కుల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారనే పాయింట్ మీద రెండు గంటల పది నిమిషాల కథనం నడిపించాడు అమల్ నీరద్. అయితే స్క్రీన్ ప్లే, బిజిఎం మీద ఎక్కువ కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి.

ప్రేమలుతో మనకు పరిచయమైన నస్లేన్ కు బయట రాష్ట్రాల్లో స్థిరమైన ఫాలోయింగ్ ఏర్పడలేదు. సీన్ ఎక్కువ జనాలకు రీచ్ అవ్వడానికి కారణం సూర్య ఇమేజ్. తర్వాతే మిగిలినవి పరిగణనలోకి వస్తాయి. అంతే తప్ప కేవలం నస్లేన్ వల్ల కాదు. అయినా ప్రచారం అసలు వద్దనుకున్న కాడికి బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్ డబ్బింగ్ ఎందుకు చేశారో, ఇంత కాంపిటీషన్ లో ఎందుకు రిలీజ్ చేశారో నిర్మాతలకే తెలియాలి. చాలా సెంటర్లలో సింగిల్ డిజిట్ ఆడియన్స్ కూడా లేక షోలు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్.