నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం అరుదే. నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌ప్పుడు చేసిన సినిమాలు వేరు కానీ.. ఇప్పుడు త‌న నుంచి వ‌స్తున్న ది ప్యార‌డైజ్ పెద్ద సినిమా కిందే లెక్క‌. దీనికి పోటీగా ఏ సినిమా రిలీజ్ కాద‌నే అనుకున్నారంతా. ముందు వారం రావాల్సిన సినిమాలు కూడా త‌ట‌ప‌టాయిస్తుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ నానికి ఖాళీగా గ్రౌండ్ వదిలేయ‌బోతున్న‌ట్లే క‌నిపించింది. కానీ అనూహ్యంగా ది ప్యార‌డైజ్‌కు పోటీగా ఓ చిన్న సినిమా బ‌రిలోకి దిగుతోంది. ఆ చిత్ర‌మే.. అనుమాన‌ ప‌క్షి.

డీజే టిల్లు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ రూపొందించిన ఈ చిత్రంలో రాగ్ మ‌యూర్ అనే చిన్న న‌టుడు లీడ్ రోల్ చేశాడు. రాగ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం ఇదే. చాన్నాళ్లు మేకింగ్‌లోనే ఉండిపోయిన ఈ చిత్రాన్ని ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధం చేశారు. ముందేమో సెప్టెంబ‌రు 18నే రిలీజ్ అన్నారు. కానీ ఏమైందో ఏమో.. వాయిదా వేశారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ది ప్యార‌డైజ్ లాంటి క్రేజీ మూవీ రిలీజ‌వుతున్న మ‌రుస‌టి రోజే అనుమాన ప‌క్షిని థియేట‌ర్ల‌లోకి దించుతున్నారు. మ‌రి కంటెంట్ మీద న‌మ్మ‌క‌మా.. లేక నాని సినిమా ఓవ‌ర్ ఫ్లోస్ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నుకున్నారా… లేదంటే ప్యార‌డైజ్‌కు పోటీ అంటే మంచి ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకున్నారా అన్న‌ది తెలియ‌దు కానీ అనుమాన ప‌క్షి టీం బోల్డ్ స్టెప్పే తీసుకుంది.

సెప్టెంబ‌రు 25కు రిలీజ్ డేట్ ఇస్తూ ది ప్యార‌డైజ్‌తో క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ట్లు ఒక కామెంట్ కూడా పాస్ చేసింది అనుమాన ప‌క్షి టీం. బ‌రిలో కాకి ఉంద‌ని ప‌క్షి ఎగ‌ర‌డం ఆప‌దు అంటూ పోస్ట‌ర్ మీద వేశారు. ఈ కామెంట్‌ను నాని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. రేప్పొద్దున సినిమాలో కంటెంట్ త‌గ్గితే ఈ కామెంట్ బూమరాంగా కావ‌చ్చు. ప్యారడైజ్ దెబ్బ‌కు ఈ సినిమాకు కుదేలు కూడా కావ‌చ్చు. మ‌రి అనుమాన ప‌క్షి నిజంగా ఈ డేట్‌కు క‌ట్టుబ‌డి నాని సినిమాతో పోటీప‌డుతుందేమో చూడాలి.