సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు పెద్ద బ్రేక్ తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలు రావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసుకొచ్చి మళ్ళీ రావా రూపంలో హిట్ ఇచ్చాక కంటిన్యూగా కనిపిస్తున్నారు. ఈయన కొత్త మూవీ మహేంద్రగిరి వారాహి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు.

కథను దాచే ప్రయత్నం చేయలేదు. మహేంద్రగిరి అనే ఊరిలో ఓ పెద్దావిడ (మంజుల) కుటుంబానికో శాపం ఉంటుంది. అంతుచిక్కని రీతిలో ఆ ఇంట్లో వాళ్ళు తరతరాలుగా చనిపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే వారాహి అమ్మవారు ఇచ్చిన శాపంగా పూజారులు చెబుతారు. దాన్నుంచి బయట పడే మార్గం వెతికేందుకు ఓ యువకుడు (సుమంత్) వస్తాడు. సమస్య మూలాలు కాశిలో ఉన్నాయని అర్థమవుతుంది. మరి ఈ చిక్కుముడి ఎలా విప్పారో రెండు వారాల తర్వాత తెలుస్తుంది.

ఇలాంటి పాయింట్ గతంలో మహేష్ బాబు మురారిలో చూసినట్టు అనిపించినా ఇందులో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి పూర్తిగా దైవత్వం వైపు మలుపు తీసుకున్నారు. విజువల్స్ లో క్వాలిటీ కనిపిస్తోంది. పరిమిత బడ్జెట్ లోనూ విఎఫ్ఎక్స్ నాణ్యత చూపించారు. అమ్మవారి అంశతో వచ్చిన పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఇందులో కీలకం కానుంది. మరో ప్రత్యేక ఆకర్షణ సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ క్యామియో రూపంలో దక్కనుంది.

ఓవరాల్ గా చూసుకుంటే ఇలాంటి జానర్ ను ఎంచుకోవడం ద్వారా సుమంత్ ట్రెండ్ కు తగ్గట్టు సరైన దారిలోకి వచ్చినట్టే ఉంది. గతంలో ఇదే కాంబోలో సుబ్రమణ్యపురం వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో పెద్ద విజయం అందుకోలేదు. జస్ట్ పాస్ అయ్యింది. కానీ మహేంద్రగిరి వారాహి మీద టీమ్ నమ్మకం చాలా బలంగా ఉంది. పోటీ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నారు. చూడాలి సుమంత్ కు ఎలాంటి బ్రేక్ దక్కుతుందో.