ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీర్తిలో మరో ఘనత చేరుకుంది,. అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై రావడం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది. షోస్టాపర్స్ ఎడిషన్ గా విడుదలైన ప్రత్యేక సంచికలో ప్రముఖ నటులు, క్రీడాకారులు, కమెడియన్లు, కాస్టింగ్ డైరెక్టర్లు, టీవీ ప్రముఖులు, గాయకులు, కళాకారులు, డిజైనర్లు మరియు ఇతర రంగాలకు చెందిన టాప్ అచీవర్స్ ని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. వారి జీవితాలకు సంబంధించిన ఘట్టాలను పంచుకున్నారు.
ఫోర్బ్స్ ఇండియా ముఖచిత్రంగా అరుదైన రికార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవాలంటే యావరేజ్ కంటెంట్ తో పనవ్వదని, మంచి కంటెంట్ ఇస్తేనే ఇక్కడ నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని కుండ బద్దలు కొట్టారు. ఈ కారణంగానే ప్రస్తుతం సంక్షోభం చూడాల్సిన పరిస్థితులు తలెత్తుత్తున్నాయని వివరించారు. బెస్ట్ అనిపించే సినిమాలు ఇవ్వడమే కీలకమని నొక్కి వక్కాణించారు.
పుష్ప రెండు భాగాల రూపంలో రెండు వేల కోట్లకు పైగా వసూళ్లతో ల్యాండ్ మార్క్ మూవీస్ అందించిన అల్లు అర్జున్ ప్రస్తుతం అత్యధిక క్రేజ్ అనుభవిస్తున్న టాప్ స్టార్స్ లో ఒకరు. బ్రాండ్ అంబాసడర్ గా కూడా బన్నీ ఎంతో ఖ్యాతి సంపాదించారు. ఇప్పటిదాకా పాతిక పైగా బ్రాండ్లు అల్లు అర్జున్ సహాయంతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. దీన్ని బట్టి దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ సెలెబ్రిటీస్ లో ఒకరిగా బన్నీ స్థానం ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది.
ప్రస్తుతం నిర్మాణంలో రాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ డ్రామా విడుదల కోసం కోట్లాది మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రారంభం కాని లోకేష్ కనగరాజ్ మూవీ సైతం విపరీతమైన హైప్ తో బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అగ్ర నిర్మాణ సంస్థలు, దర్శకులు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఉవ్విళూరుతున్న సమయంలో బన్నీ తన ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates