సీఎం కొడుకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రెండేళ్లకే అనూహ్యంగా సీఎం అయిపోయాడు విజయ్. అతను పాలిటిక్స్‌లో పెద్ద రేంజికి వెళ్లిపోవడం అభిమానలుకు సంతోషమే అయినా.. సినిమాలకు దూరం అయిపోవడం బాధే. ఐతే విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన టైంలోనే ఆయన తనయుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం.

కాకపోతే ఫ్యాన్స్ కోరుకున్నట్లు హీరోగా కాకుండా అతను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. పాతికేళ్లు నిండకుండానే అతను మెగా ఫోన్ చేతబట్టిన జేసన్ సంజయ్ ‘సిగ్మా’ అనే సినిమా తీశాడు. మన తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. టాలీవుడ్‌కే చెందిన ఫరియా అబ్దుల్లా కథానాయిక పాత్ర చేసింది. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.

నిజానికి ‘సిగ్మా’ సినిమాను జులై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ అనుకోకుండా జులై 23న రిలీజ్‌కు రెడీ అవడంతో తండ్రి సినిమాతో తన చిత్రానికి క్లాష్ వద్దని సంజయ్ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ‘సిగ్మా’ మూవీకి రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబరు 2న గాంధీ జయంతి కానుకగా ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

‘జననాయగన్’ రిలీజ్‌ తర్వాత రెండు మూడు వారాలు గ్యాప్ ఇచ్చి ‘సిగ్మా’ను రిలీజ్ చేస్తారనుకుంటే.. మరీ రెండు నెలలకు పైగా గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యకరమే. మరి తన తొలి చిత్రంతో జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరం. ఈ సినిమాకు తెర వెనుక విజయ్ కీలకంగానే వ్యవహరించినట్లు.. కథ కూడా విన్నట్లు హీరో సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సంజయ్ అసలైన జెన్జీ దర్శకుడని.. సినిమా చాలా కొత్తగా ఉంటుందని, పెద్ద విజయం సాధిస్తుందని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు.