రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో ఈగల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు నిరాశపరిచినా.. ‘ఇరుముడి’ ఆయనకు భారీ విజయాన్నందించింది. దీంతో మరింత ఉత్సాహంగా డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. రాజ రాజ చోర, శ్వాగ్ చిత్రాల దర్శకుడు హాసిత్ గోలితో సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.

దీంతో పాటు మరో న్యూ ఏజ్ దర్శకుడితో మాస్ రాజా జట్టు కట్టబోతున్నాడు. అతనే.. వివేక్ ఆత్రేయ. ‘మెంటల్ మదిలో’ నుంచి ‘సరిపోదా శనివారం’ వరకు ప్రతిసారీ కొత్త తరహా సినిమానే తీశాడు వివేక్. ఇప్పుడు మాస్ రాజాతో ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది.

రవితేజ, వివేక్ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్ ఖాయం చేసినట్టు సోషల్ మీడియా టాక్. రవితేజ లాంటి మాస్ హీరో సినిమాకు ఇలాంటి టైటిల్ ఊహించలేం. టైటిల్లో వివేక్ ఆత్రేయ మార్కు కనిపిస్తోంది. ఈ టైటిల్ పెట్టాడంటే దాని చుట్టూ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఆ కథేంటన్నది ఆసక్తికరం. వినగానే క్యూరియాసిటీ కలిగించే టైటిల్ ఇది. కాబట్టి ఫస్ట్ స్ట్రైక్‌తో సక్సెస్ అయినట్లే. ఈ సినిమా వివేక్ ఆత్రేయ స్టైల్లోనే భిన్నంగా ఉంటూ.. ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని సమాచారం.

ఒకప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు భాగస్వామిగా ఉండి, తర్వాత ఎస్వీసీ సంస్థ నుంచి బయటికి వచ్చేసిన లక్ష్మణ్ ఈ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే వేసవిలో రిలీజ్ చేసే లక్ష్యంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి వస్తాయి. రవితేజతో శ్రీ విష్ణు కలిసి నటిస్తున్న హాసిత్ గోలి సినిమా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసింది.