ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ క్లిక్ అయితే రాజమౌళి సినిమాల రేంజిలో ఆడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే సినిమా ఆలస్యం అవుతున్నా సరే.. బన్నీ అభిమానులు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. తాము కోరుకున్న స్థాయిలో అప్‌డేట్స్ ఇవ్వకపోయినా.. ఔట్ పుట్ అంచనాలకు తగ్గట్లు ఉంటే చాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలు చేయబోతున్నారంటూ గతంలో ఒక ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత అదేమీ లేదని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ‘రాకా’ 2 పార్ట్స్‌గా రావడం ఖాయమంటున్నారు. ఇప్పటిదాకా చిత్రీకరణ జరిపిన రషెస్ చూసుకుని.. బడ్జెట్ విషయంలో లెక్కలు వేసుకుని చూశాక దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయడమే బెటర్ అనే నిర్ణయానికి టీం వచ్చినట్లు సమాచారం.
‘రాకా’ను రూ.800 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలుపెట్టారు. కానీ ఆల్రెడీ ఎస్టిమేషన్ రూ.900 కోట్లకు పెరిగింది. సినిమా పూర్తయ్యేసరికి వెయ్యి కోట్లు కూడా అవ్వొచ్చని భావిస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి ఒక సినిమాతో వర్కవుట్ చేయడం కష్టమని భావిస్తున్నారు. అలాగే కథ పరిధి కూడా పెద్దదని.. అనుకున్న స్క్రిప్టు మొత్తం పూర్తి చేసేసరికి ఐదారు గంటల ఔట్ పుట్ వస్తుందని అంచనా వేస్తున్నారట. దీన్ని రెండున్నర మూడు గంటలకు కుదించడం కన్నా.. రెండు భాగాలు చేయడం మంచిదని భావిస్తున్నారు.
కంటెంట్ మీద చాలా నమ్మకంతో ఉన్న టీం.. ముందు ఒక పార్ట్ రిలీజ్ చేస్తే మంచి స్పందన వస్తుందని.. ‘బాహుబలి-2’, ‘పుష్ప-2’ లాగే రెండో పార్ట్‌ను ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లవచ్చని అనుకుంటున్నారట. కాబట్టి 2 పార్ట్స్ ఖాయమని.. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. పార్ట్-1ను వచ్చే ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసి.. ఎక్కువ గ్యాప్ లేకుండా 2028 సెకండాఫ్‌లో రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తోందట సన్ పిక్చర్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates
