హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో ఒక సినిమాతో రెగ్యులర్ గా పలకరించడం తనకలవాటు. గత ఏడాది డిసెంబర్ శంబాల రూపంలో మంచి సక్సెస్ సాధించిన ఆది ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. పది నెలలు గ్యాప్ వచ్చేసింది. డైరీ ఖాళీ లేకపోయినప్పటికీ రకరకాల కారణాల వల్ల రిలీజులు వాయిదా పడ్డాయి. అయితే హఠాత్తుగా రేపు తన కొత్త మూవీ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ రిలీజవుతోంది.

నిజానికి దీనికి సంబంధించి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. మాములుగా అయితే రెండు మూడు వారాల ముందు నుంచి హడావిడి చేస్తే తప్ప జనం దృష్టిలో పడటం కష్టంగా ఉంది. తెల్లకాగితం అందుకే ప్రత్యేకంగా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టి జనాల దృష్టిని ఎంతో కొంత తనవైపు వచ్చేలా చేసుకుంది. అలాంటిది సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఇంత సడన్ గా ఊడిపోడటం ఎవరూ ఊహించనిది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి అగ్రిమెంట్ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట.

అసలే కాంపిటీషన్ తీవ్రంగా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి పదికి పైగా సినిమాలు ఒకేసారి దండయాత్ర చేస్తున్నాయి. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సిగ్మా, తెల్లకాగితం మాత్రమే బజ్ తెచ్చుకున్నాయి తప్పించి మిగిలినవి పూర్తిగా టాక్ మీద ఆధారపడ్డాయి. ఎస్ఐ యుగంధర్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ట్రైలర్ చూస్తే కథ మరీ కొత్తగా అనిపించడం లేదు. దేవుడిగా ఫీలయ్యే ఒక సైకో కిల్లర్ శవాలను మాయం చేస్తూ డిపార్ట్ మెంట్ కు సవాల్ గా మారతాడు. ఆ కేసుని ఛేదించడమే స్టోరీ.

ఊహించని ట్విస్టులు ఏమైనా ఉన్నాయేమో థియేటర్లో చూశాక క్లారిటీ వస్తుంది. శంబాల తర్వాత ఆది సాయికుమార్ స్పీడ్ తగ్గించాడు. వచ్చిన విజయాన్ని నిలబెట్టుకునే దిశగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ యుగంధర్ ఎప్పుడో పూర్తయ్యింది. థియేటర్ రిలీజ్ కొంచెం ఆలస్యమయ్యింది. సౌండ్ లేకుండా వచ్చి ఇంత పోటీలో కనక సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ నిలబడితే మటుకు ఖచ్చితంగా విశేషమే అవుతుంది. చూడాలి మరి ఏ మేరకు నెట్టుకు వస్తాడో, ఏ మాత్రం మెప్పిస్తాడో.