మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్ జరగట్లేదు.. లాభాలు రావడం చాలా కష్టమైపోతోంది.. అంటూ ఇండస్ట్రీలో పరిస్థితులు రోజు రోజుకూ ఇబ్బందిగా మారిపోతుండడం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఐతే కొన్ని సినిమాలకు మాత్రం ఇవేవీ వర్తించవు.

ఆ సినిమాలను రికార్డు స్థాయిలో రేట్లు పెట్టి బయ్యర్లు కొంటారు. ఎంత ఎక్కువపెట్టినా సరే రిస్క్ ఉండదు అనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. మంచి లాభాలూ వస్తాయి. అలాంటి ధీమా రాజమౌళి సినిమాలకే సొంతం. రాజమౌళి ప్రతి సినిమాకూ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. ఆ నంబర్లు చూసి వామ్మో వాయ్యో అనుకుంటారు. మరీ రిస్కేమో అనే అనుమానం కలుగుతుంది. చివరికి చూస్తే ఆయన సినిమాలు అంచనాలను మించిపోయి భారీ వసూళ్లు సాధించి బయ్యర్లకు లాభాలు అందిస్తాయి.

నాలుగేళ్ల ముందు జక్కన్న చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.225 కోట్లు పెట్టి కొంటే.. అది చాలా పెద్ద రిస్క్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఆ సినిమా ఫుల్ రన్లో రూ.265 కోట్ల మేర షేర్ రాబట్టింది. పెద్ద స్టార్లు డైరెక్టర్ల కొత్త సినిమాలకు వారి పాత సినిమాల ఫైనల్ షేర్‌ను ప్రామాణికంగా తీసుకుని బిజినెస్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’కి కూడా అదే పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఏరియాల వారీగా ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ షేర్ ఆధారంగా.. ఈ సినిమాకు అమ్మకాలు మొదలయ్యాయట. ఆ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.275 కోట్ల మేర బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఈ నంబర్ అంటే.. ఇక మిగతా ఇండియన్ స్టేట్స్, వరల్డ్ వైడ్ బిజినెస్ ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.

ఆ లెక్క రూ.1000 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆరొందల కోట్లకు తక్కువ కాకుండా రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తన్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి కనీసం రూ.300 కోట్ల లాభం రావడం ఖాయమన్నమాట.