సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి మూవీగా తమిళంలో చెప్పుకోదగ్గ బజ్ ఉండగా, సందీప్ కిషన్ హీరో కావడంతో తెలుగులోనూ మంచి రిలీజ్ దక్కుతోంది. మైత్రి పంపిణి బాధ్యతల వల్ల థియేటర్లు బాగానే దక్కించుకున్న నేపథ్యంలో రేపు టాక్ ఎలా ఉంటుందనే ఉత్సుకత అధిక శాతం వర్గాల్లో ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ లో.

హీరోగా ఎంట్రీ ఇస్తే కోట్లకు కోట్లు ఆదాయం వచ్చే రెడ్ కార్పెట్ వేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నా జేసన్ సంజయ్ ఎంచుకున్న రూటు ఖచ్చితంగా ఆశ్చర్యపరిచేదే. ఎందుకంటే డైరెక్షన్ చాలా సవాళ్లతో కూడుకున్నది. స్వయానా తండ్రే ఎప్పుడూ ఆ రిస్క్ తీసుకోలేదు. నటనకు పరిమితమయ్యాడు తప్పించి మెగా ఫోన్ పట్టుకోవాలనే ఆలోచన చేయలేదు. అలాంటిది జేసన్ ఇలా ముందడుగు వేయడం సూర్య, కార్తీ లాంటి స్టార్ హీరోలను సైతం మద్దతు ఇచ్చేలా చేసింది.

సిగ్మాకు సంబంధించి మెచ్చుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జేసన్ సంజయ్ ఏదో ఆషామాషీ ప్రేమకథనో ఈ మధ్య తమిళంలో బాగా వర్కౌట్ అవుతున్న కులాల అణిచివేతనో ఎంచుకోలేదు. స్క్రీన్ ప్లే ఛాలెంజింగ్ గా ఉండే మనీ హీస్ట్ (దొంగతనాలు) బ్యాక్ డ్రాప్ రాసుకున్నాడు. రాజు సుందరం లాంటి సీనియర్లను పట్టుకొచ్చి యాక్టింగ్ చేయించాడు. గ్లామర్ హీరోయిన్స్ కాదని ఫరియా అబ్దుల్లాకు ఓటు వేశాడు. ఇలా చాలా క్యాలికులేషన్లతో బరిలో దిగుతున్నాడు.

ఏపీ తెలంగాణ కలిపి 400 పైగా స్క్రీన్లలో సిగ్మా రిలీజవుతుండటం విశేషం. తమన్ మ్యూజిక్ గురించి యూనిట్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుతోంది. సిగ్మా కనక సక్సెస్ అయితే ఇటు సందీప్ కిషన్, అటు జేసన్ సంజయ్ ఇద్దరికీ జాక్ పాట్ తగిలినట్టే. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు రేపు ఆప్షన్లు విపరీతంగా ఉన్నాయి. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకాగితం లాంటి వాటిని దాటేయాలంటే సిగ్మాలో రెగ్యులర్ గా అనిపించని కంటెంట్ ఎంగేజింగ్ గా ఉంటే చాలు. మిగిలింది జనాలు చూసుకుంటారు.