పుష్ప, పెద్ది స్టయిల్లో ఫౌజి

ఇంతకుముందు పెద్ద సినిమాలకు అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున బెనిఫిట్ షోలు ఉండేవి. కానీ ఈ మధ్య ట్రెండు మారింది. అలాంటి ఆడ్ టైమింగ్స్‌లో షోలు చూస్తే జనం మూడ్ సరిగా ఉండట్లేదని, టాక్ కూడా తేడా కొడుతోందని అర్థమైన ఫిలిం మేకర్స్ ముందు రోజు రాత్రే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ఫ: ది రూల్’ సినిమా దగ్గర్నుంచి ఈ ట్రెండు నడుస్తోంది. 

ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ, అఖండ-2, మన శంకర వరప్రసాద్ గారు.. ఇలా దాదాపుగా అన్ని పెద్ద సినిమాలూ ఇదే బాటలో సాగాయి. ఈ మధ్యే ‘పెద్ది’కి కూడా అదే స్టైల్ ఫాలో అయ్యారు. ఇక ఈ ఏడాది సెకండాఫ్‌లో రాబోయే అత్యంత పెద్ద సినిమా ‘ఫౌజి’కి కూడా ఈ ట్రెండు కొనసాగబోతోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 3న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే ఇలాంటి భారీ చిత్రాలకు ముందు డేట్ ఇచ్చి, తర్వాత మార్చడం మామూలే. ఈ నేపథ్యంలో ‘ఫౌజి’ రిలీజ్ మీదా అనుమానాలున్నాయి. కానీ ‘కేజేక్యూ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన మైత్రీ అధినేత రవిశంకర్.. ‘ఫౌజి’ నూటికి నూరుపాళ్ళు డిసెంబరు 3న రిలీజ్ అవుతుందని నొక్కి వక్కాణించాడు. అంతే కాక ముందు రోజు ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ కూడా ఉంటాయని తేల్చి చెప్పాడు. 

తమ సినిమా షూటింగ్ మంచి స్పీడుతో, ప్లాన్ ప్రకారం నడుస్తోందని, రిలీజ్‌లో ఏ మార్పూ ఉండదని కూడా ఆయన స్సష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘ఫౌజి’ షూట్ జరుగుతోంది. అక్కడ ఛార్మినార్ సెట్ వేసి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘స్పిరిట్’ షూట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న ప్రభాస్.. 25 రోజుల పాటు నిర్విరామంగా జరిగే ‘ఫౌజి’ షూట్‌లో పాల్గొంటాడని, దాంతో దాదాపుగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.