రివ్యూల లాజిక్ మిస్సయిన గీత రచయిత

సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ ఫార్మ్. ఒక్కసారి థియేటర్లో వచ్చాక దాని మీద అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా చెప్పకూడదని కొందరు కోర్టుకు కూడా వెళ్లారు కానీ పనవ్వలేదు. రివ్యూలు కేవలం మీడియాలోనే కాదు ఎందరో నెటిజన్లు, ఇన్ఫ్లు యెన్సర్లు ఇన్స్ టా, ఎక్స్, యూట్యూబ్లో ప్రతి శుక్రవారం వీడియోలు, మెసేజులు పోస్ట్ చేయడం చూస్తుంటాం. వాటిలో పాజిటివ్, నెగటివ్ రెండు ఉంటాయి. ఈ విషయంగా గీత రచయిత అనంత శ్రీరామ్ కు కోపం వచ్చింది. తన నిరసనని చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్ లో ప్రకటించారు.

ఇదే మూవీని ఇదే స్క్రీన్ ప్లేతో వచ్చి ఉంటే తమిళంలో టెర్రిఫిక్, మలయాళంలో మేజిక్, హిందీలో హిస్టారిక్ అని పొడుగుతారని, కానీ తెలుగులో మాత్రం పాండెమిక్ అనేస్తారని, కెమెరా లెన్స్ ముందుకు వచ్చినప్పుడు కాస్త సెన్స్ తో ఉండాలని, ఒకవేళ రివ్యూ చెప్పాలనుకుంటే టికెట్ డబ్బులకు బాధ్యతగా ఇంట్లో వాళ్లకు చెప్పాలి తప్ప బయట వాళ్లకు కాదని హిత బోధ చేశారు. నిజానికి సినిమా హిట్టయ్యింది కాబట్టి రివ్యూల మీద ఇంత బాధ పడాల్సిన అవసరమైతే లేదు.

అనంత శ్రీరామ్ ఒక లాజిక్ మిస్సవుతున్నారు. మలయాళం సినిమాలను సోషల్ మీడియాలో మనోళ్లు తరచుగా మోసే మాట నిజమే. కానీ అవన్నీ అత్యధిక శాతం ఓటిటిలో కాలు కదపకుండా చూసినవే. గత అయిదేళ్లలో ఏపీ తెలంగాణ థియేటర్లలో విరగబడి ఆడిన మల్లువుడ్ మూవీ ఒక్కటి కూడా లేదు. ప్రేమలు డీసెంట్ హిట్టు కొట్టగా, లోకా చాప్టర్ 1 రెండు మూడు రోజుల తర్వాత స్లో అయిపోయింది. కేరళలో ఎల్ 2 ఎంపురాన్ ఇండస్ట్రీ హిట్ అయితే మన దగ్గర రెండో వారానికి చాప చుట్టేసింది.

తమిళం, కన్నడ సంగతి చూస్తే వీరభద్రుడు, కెజిఎఫ్, కాంతార లాంటి కమర్షియల్ గ్రాండియర్స్ మాత్రమే ఆదరణకు నోచుకున్నాయి తప్ప సెన్సిబుల్ కథలను నెత్తినబెట్టుకున్న దాఖలాలు మన ఆడియన్స్ నుంచి ఎప్పుడూ లేవు. అలాంటిది చెన్నై లవ్ స్టోరీ సెకండాఫ్ మీద కాసిన్ని కామెంట్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకోకుండా మీకే సినిమా చూడటం రాదు అనడం విడ్డూరం. హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నా బొమ్మ  సూపర్ హిట్టయినప్పుడు ఇలా లేనిపోని క్లాసులు తీసుకుంటే ఏం లాభం.