చెన్నై వేడుకలో ‘చిరంజీవి’ చమక్కులు

ఏదైనా వేడుకకు మెగాస్టార్ వస్తే ఆ అందమే వేరు. తన హాజరుతో పాటు మాటల మంత్రాలు వేసి ఆహుతులను మంత్రముగ్దులను చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులోనూ అభిమానులు తీసిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తే జరిగే సందడి ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. చెన్నై లవ్ స్టోరీ దానికి వేదికగా నిలిచింది. ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ మూవీ సెలబ్రేషన్స్ కు చిరు గెస్టుగా గ్రేస్ కాస్ట్యూమ్ తో రావడం ఎప్పటిలాగే హైలైట్ అయ్యింది.

ఇక చిరంజీవి స్పీచులో చాలా చమక్కులు దొర్లాయి. మంచి స్ఫూర్తివంతమైన మాటలూ ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి చంద్రమోహన్ దాకా ఎందరో ఉద్దండులు ఉన్న పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు నేనేం ఇవ్వగలనని ప్రశ్నించుకుని ఆడియన్స్ ని అలరించేలా పేరు తెచ్చుకున్నానని, అదే దారిలో కిరణ్ అబ్బవరం వెళ్లడం సంతోషంగా ఉందని పెద్ద కితాబే ఇచ్చారు. కిరణ్ అన్నయ్య తన ఫ్యాన్ కాగా తమ్ముడు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ సరదాగా చురక వేశారు.

ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడుతూ రాత్రి కాకుండా పగలు కలలు కనాలని, అవి నిజం చేసుకునేందుకు కష్టపడాలని పిలుపు ఇచ్చారు చిరంజీవి. తనకు ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. దర్శకుడు రవి నంబూరికి పుట్టినరోజు గ్రీటింగ్స్ చెబుతూ స్టేజి మీద అందరినీ పేరు పేరునా గుర్తు చేసుకుని మరీ శుభాకాంక్షలు అందజేశారు. దానికన్నా ముందు టీమ్ సభ్యులు చిరుకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

ఇంకో ఇరవై నాలుగు గంటల్లో విడుదల  కాబోతున్న చెన్నై లవ్ స్టోరీకి ఈ చిరు హాజరు ఖచ్చితంగా ఒక ఎనర్జీ ఇస్తుంది. బేబీ స్థాయిలో అంచనాలు నెలకొనడంతో దాన్ని అందుకుని తీరతామని టీమ్ నమ్మకంగా ఉంది. ముందు రోజు రాత్రే మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్లు వేయడం ద్వారా కంటెంట్ మీద నమ్మకాన్ని చూపిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే లెనిన్ తర్వాత బాక్సాఫీస్ కు ఊపు కొనసాగించిన సినిమాగా చెన్నై లవ్ స్టోరీకి పెద్ద ప్రయోజనం కలుగుతుంది.