అన్నయ్య డ్రాప్… తమ్ముడు ఫిక్స్ ?

బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది. ఇది సహజం. అయితే స్వంతవాళ్లకు ఇస్తే మరింత ఆనందం కలుగుతుంది. ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు ఇండస్ట్రీలో కూడా జరుగుతూ ఉంటాయి. రామ్ చరణ్ పెద్దిని మొదట మార్చి చివరి వారం రిలీజ్ డేట్ అనుకున్నారు. కానీ వాయిదా తప్పకపోవడంతో ఆ స్లాట్ ని పవన్ కళ్యాణ్ ఉస్తాద్  భగత్ సింగ్ కోసం వాడుకున్నారు. అలా అబ్బాయి డేట్ బాబాయ్ తీసుకున్నాడు.

అచ్చం ఇలాగే ఇప్పుడు దేవరకొండ బ్రదర్స్ కు జరుగుతోంది. విజయ్ దేవరకొండ రణబాలి ముందు అఫీషియల్ గా ప్రకటించిన దాని ప్రకారం సెప్టెంబర్ 11 రావాలి. కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు మొదలైనవి అంత వేగంగా అయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పుడు దాని స్థానంలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎపిక్ రావడానికి రంగం సిద్ధమవుతోందట. 90స్ మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న డెబ్యూ మూవీ ఇది.

ఎపిక్ కూడా వాయిదాల పర్వంలో నలిగిన సినిమానే. మార్చి నుంచి ఏవేవో తేదీలు అనుకున్నారు. జూలై బెస్ట్ ఆప్షన్ గా భావించారు. కానీ అదే సితార బ్యానర్ లో రూపొందిన లెనిన్ కోసం తప్పుకోవాల్సి వచ్చింది. ఆగస్ట్ స్లాట్స్ టైట్ గా ఉండటంతో ఇంకో నెల ఆలస్యంగా సెప్టెంబర్ కు వెళ్లిపోతున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఎపిక్ అధిక శాతం షూటింగ్ విదేశాల్లో జరిగింది. కొన్ని నెలల క్రితం వచ్చిన టీజర్ యూత్ కి బాగానే రీచ్ అయ్యింది. బ్రదర్స్ మార్పులు ఇంకా అధికారికం కాలేదు.

ఎలా చూసినా టాలీవుడ్ లో పోస్ట్ పోన్ల యవ్వారం షరామాములు వ్యవహారంలా మారిపోయింది. ఇటీవలే లెనిన్ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ మనం ఎందుకు చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిస్సి లాంటి మూవీ ఏడాది ముందు చెప్పిన డేట్ కి కట్టుబడి ఉన్నప్పుడు మనం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ రెడీ చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది ఇప్పట్లో ఆగని ఆపలేని అంతులేని కథ.