తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత హంగామా నెలకొన్న అరంగేట్రాల్లో అఖిల్ అక్కినేనిది ఒకటి. రెండేళ్ల వయసుండగానే ‘సిసింద్రీ’ సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించాడు అఖిల్. అతను పెద్దయ్యాక హీరోగా అరంగేట్రం చేస్తుంటే.. కాబోయే సూపర్ స్టార్ అని అందరూ ముందే ఫిక్సయ్యారు. కానీ పదేళ్ల తర్వాత చూస్తే.. కెరీర్లో సరైన హిట్ లేక, హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్నాడు ఈ అక్కినేని కుర్రాడు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో ఫ్లాప్ తప్పించుకున్నాడు కానీ.. హిట్ అయితే కొట్టలేదు. తర్వాతి చిత్రం ‘ఏజెంట్’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో అఖిల్ పరిస్థితి అయోమయంగా తయారైంది. అఖిల్‌కు హిట్ ఇవ్వాలని నాగార్జున మొదట్నుంచి ఎంతగా తపిస్తున్నాడో తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా అఖిల్‌కు హిట్ పడాలని కోరుకుంటోంది. అక్కినేని అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మిగతా ఫ్యాన్‌డమ్స్‌లో కూడా అఖిల్ పట్ల సానుకూల భావన, సానుభూతి ఉన్నాయి.
‘లెనిన్’ మూవీతో అఖిల్ కోరుకున్న విజయం దక్కుతుందనే అంచనాలు కలుగుతున్నాయి. ఈ సినిమా ప్రోమోలు ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద దర్శకులుండగా.. నాగ్ కోరితే వారిలో ఒకరు అఖిల్‌తో సినిమా చేసే అవకాశమున్నా.. వాళ్లెవ్వరినీ కాదని ఒక మోస్తరు ఫలితాన్నందుకున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ అబ్బూరుకు ఛాన్స్ ఇచ్చింది అక్కినేని ఫ్యామిలీ. వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి, విక్రమ్ కె.కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ల వల్ల కూడా అఖిల్‌కు హిట్టవడం సాధ్యపడలేదు. అలాంటిది ఒక సినిమా అనుభవమున్న డైరెక్టర్‌కు ఈ బాధ్యత అప్పగించడం ఆశ్చర్యమే. ఇది చాలా పెద్ద బరువన్నట్లే.
మరి ఈ సినిమాను మురళీ కిషోర్ ఎలా హ్యాండిల్ చేశాడన్నది ఆసక్తికరం. నాగ్‌తో పాటు నిర్మాతగా మంచి పేరున్న నాగవంశీ కలిసి నిర్మించిన సినిమా అంటే ఈసారి తప్పు జరగదనే భావిస్తున్నారు. ‘లెనిన్’ టీం కాన్ఫిడెన్స్ చూస్తే సూపర్ హిట్ ఖాయమన్నట్లే కనిపిస్తోంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి అఖిల్ కోరుకున్న సక్సెస్ పడితే.. మురళీ కిషోర్ పేరు మార్మోగిపోవడం ఖాయం. ఈ సినిమా మేకింగ్ టైంలో, ప్రమోషన్లలో మురళీ పూర్తిగా తెర వెనుకే ఉండిపోయాడు. తన గురించి పెద్దగా చర్చ కూడా జరగలేదు. కానీ అఖిల్‌కు హిట్ ఇచ్చాడంటే మాత్రం తన పేరు మార్మోగడం.. పెద్ద స్టార్ల నుంచి కడా పిలుపు రావడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates