ఒకప్పుడు వచ్చిన సినిమాలు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఎలా ఇస్తాయో వాటి వెనుక సంగతులు అంతే ఆసక్తి కలిగిస్తాయి. కాకపోతే అవి చెప్పే సోర్సెస్ లేదా వీడియోలు మనకు ఎక్కువ అందుబాటులో ఉండవు. హాలీవుడ్ లో వాటిని దాచి భవిష్యత్ తరాలకు అందిస్తారు కానీ టాలీవుడ్ లో ఈ చొరవ తీసుకునే వాళ్ళు తక్కువ. బాహుబలి నుంచి రాజమౌళి ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల మొన్న నెట్ ఫ్లిక్స్ లో టార్చ్ బేరర్ చూడగలిగాం. ఇలాంటి ఒక మెమరీ గురించే ఈ డిస్కషన్.
ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం 2001 లో అనుకోకుండా ఒక రోజు విడుదలయ్యింది. ఛార్మీ ప్రధాన పాత్రలో జగపతిబాబు స్పెషల్ రోల్ చేసిన ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. ప్లే బ్యాక్ సింగర్ గా ఉండే ఒక అమ్మాయి జీవితంలో ఒక రోజు మిస్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇదంతా దేవుళ్ళ పేరుతో అమాయకులను ఉన్మాదులుగా మారుస్తున్న ఒక ముఠా దగ్గరకు వెళ్తుంది. విపరీతమైన ట్విస్టులతో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కట్టిపారేస్తారు.
కాకపోతే కమర్షియల్ గా అనుకోకుండా ఒక రోజు భారీ వసూళ్లు రాబట్టలేదు. బాక్సాఫీస్ కోణంలో యావరేజ్ గా నిలిచిచిపోయింది. క్రమంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతేతో దర్శకుడిగా పరిచయమైన చంద్రశేఖర్ యేలేటికి ఫాలోయింగ్ పెంచడంలో దోహద పడింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి గంటన్నర మేకింగ్ వీడియోని యూట్యూబ్ లో ఒకరు పోస్ట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు పంచుకున్న విశేషాలు అందులో బోలెడు ఉన్నాయి.
మరో విశేషం ఏంటంటే ప్రభాస్ తో ఫౌజీ తీస్తున్న హను రాఘవపూడి, రాధే శ్యామ్ తీసిన రాధా కృష్ణ ఇద్దరూ అనుకోకుండా ఒక రోజు డైరెక్షన్ టీమ్ లో ఉన్నారు. వాళ్ళు పంచుకున్న కబుర్లు కూడా ఉన్నాయి. యువకులుగా వెంటనే గుర్తుపట్టలేనంత లేతగా ఉండటం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి మేకింగ్ వీడియోలు, డాక్యుమెంటరీలు మరిన్ని బయటికి వస్తే ఆడియన్స్ కి కొత్త రకమైన అనుభూతితో పాటు టీమ్ పడిన కష్టం సాక్ష్యాల రూపంలో కళ్ళముందు కనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates