యూత్, మాస్ చాలు… ఇంకెవ‌రూ వ‌ద్దు

మాది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌.. పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ చూడొచ్చు.. మాది కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా అని ప్ర‌చారం చేయ‌డం మామూలే. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులూ చూస్తేనే థియేట‌ర్లు నిండుతాయి. సినిమాల‌కు ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తాయి. పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఒక సినిమాకు క‌నెక్ట్ అయ్యారంటే దాని రేంజే మారిపోతుంది. అందుకే పెద్ద సినిమాల మేక‌ర్స్ వారిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్న‌మే చేస్తుంటారు. కానీ ఆ వ‌ర్గం ప్రేక్ష‌కులు త‌మ‌కు వ‌ద్దే వ‌ద్ద‌ని బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వ‌డం అంటే సాహ‌స‌మే.

చాలా కొద్దిమంది ఫిలిం మేక‌ర్స్ మాత్ర‌మే ఈ రిస్క్ తీసుకుంటారు. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ సినిమాల తీరు ఇలాగే ఉంటుంది. త‌న ప్ర‌తి సినిమాకూ ఎ సర్టిఫికెట్టే వ‌స్తుంటుంది. అయినా త‌న సినిమాల‌కు భారీ క‌లెక్ష‌న్లు గ్యారెంటీ. యూత్ త‌న చిత్రాల‌ను ఎగ‌బ‌డి చూస్తుంటారు. ఇప్పుడు టాక్సిక్ సినిమా మేక‌ర్స్ సైతం ఇదే బాట‌లో సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

టాక్సిక్ నుంచి ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన ప్ర‌తి ప్రోమో కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. గ‌త ఏడాది టీజ‌ర్ రావ‌డానికి ముందు వ‌ర‌కు ఈ సినిమాను ప్రేక్ష‌కులు చూసిన కోణం వేరు. కానీ ఆ టీజ‌ర్లో కారులో ఇంటిమేట్ సీన్‌కు, బ్లాస్ట్‌కు లింక్ పెట్టి తీసిన‌ లాస్ట్ షాట్ చూశాక జ‌నాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ దెబ్బ‌తో ఇది పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూడ‌ద‌గ్గ సినిమా కాద‌ని తేలిపోయింది. త‌ర్వాత రిలీజ్ చేసిన కంటెంట్ అంతా కూడా ఇంతే బోల్డ్‌గా, సెన్సేష‌న‌ల్‌గా ఉంటోంది.

సినిమాలో ఇటు రొమాన్స్, అటు వ‌యొలెన్స్ ఒక రేంజిలో ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతోంది. లేటెస్ట్ టీజ‌ర్ కూడా అదే సంకేతాల‌ను ఇచ్చింది. పిల్ల‌లు ఈ సినిమాకు దూరంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు కానీ.. వారితో పాటు కుటుంబ ప్రేక్ష‌కులూ సినిమాకు దూరమ‌య్యేలా ఉన్నారు. ఐతేనేం యూత్ మాత్రం ఈ సినిమాను ఎగ‌బ‌డి చూసే అవ‌కాశం ఉంది. మాస్ ఆడియ‌న్స్‌లోనూ సినిమాకు బంప‌ర్ క్రేజ్ క‌నిపిస్తోంది. కాబ‌ట్టి వాళ్ల‌కు సినిమా క‌నెక్ట్ అయితే చాలు.. యానిమ‌ల్‌లాగే ఇది కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.