బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు కొత్త ఏడాదికి అద్భుత ఆరంభాన్నిచ్చాయి. తర్వాత కూడా అదే ఊపు కొనసాగుతుందని ఆశిస్తే.. దారుణమైన స్లంప్‌ను చూసింది టాలీవుడ్.

సంక్రాంతి తర్వాత నాలుగు నెలల పాటు నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేకపోయింది. చాలా వారాలు బాక్సాఫీస్ వెలవెలబోయింది.
వేసవిలో థియేటర్లు ఖాళీగా దర్శనమివ్వడం ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కానీ సమ్మర్ సీజన్ చివర్లో, జూన్ తొలి వారం నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్‌‌లో మంచి జోష్ కనిపిస్తోంది. అనుకున్నట్లే ‘పెద్ది’ సినిమా థియేటర్లకు జీవనాడిగా మారింది. చాన్నాళ్ల తర్వాత వెండి తెరల్లో వెలుగులు కనిపించాయి. రెండో వారం కూడా హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలా చేసింది.

ఇక ‘పెద్ది’ బాగా ఆడుతుండగానే వచ్చిన సింగీతం శ్రీనివాసరావు సినిమా ‘సింగ్ గీతం’ నెమ్మదిగా మొదలై.. బలంగా పుంజుకుంది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. థియేటర్ల నుంచి రాబట్టాల్సిన టార్గెట్ కలెక్షన్లను ఆ చిత్రం అందుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ జోష్ కొనసాగుతోంది.

సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ అంచనాలను మించి పెర్ఫామ్ చేస్తోంది. కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాను జనం ఏం పట్టించుకుంటారు అన్నట్లుండేది. కానీ రిలీజ్ దగ్గర పడ్డాక అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి.

ఇక రిలీజ్ రోజు ఈ చిత్రం కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్లకు ఢోకా లేదు. రోజంతా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. వీకెండ్లో ఈ సినిమా మరింత బాగా పెర్ఫామ్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఈ వారం చిత్రాల్లో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మినహా చిత్రాలన్నింటికీ పాజిటివ్ టాకే వచ్చింది. దీవానా బాగా ఆడేలా కనిపిస్తోంది.

‘బాలన్’, ‘వంద దేవుళ్ళు’ చిత్రాలకు వసూళ్లు నెమ్మదిగా ఉన్నా వాటికి వచ్చిన పాజిటివ్ టాక్ వసూళ్లను పెంచే అవకాశముంది. మొత్తానికి జూన్ నెల టాలీవుడ్‌కు బాగానే కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది.