సీనియర్ హీరో… అరుదైన జాబితాలో చేరతాడా?

2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేయలేక ఫేడవుట్ అయిన వాళ్లే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, నాగార్జునలను మినహాయిస్తే.. మిగతా సీనియర్ స్టార్లు అందరిదీ ఇదే పరిస్థితి.

రాజశేఖర్, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్.. ఇలా చాలామంది తర్వాతి లీగ్ సీనియర్ స్టార్లు హీరోలుగా మార్కెట్ కోల్పోయారు. వీరి రేంజ్ కాకపోయినా.. 90వ దశకంలో మంచి మంచి హిట్లు కొట్టిన హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. కానీ 2000 తర్వాత అతను జోరు కొనసాగించలేకపోయాడు.

చివరగా ‘నా ఊపిరి’ చిత్రంతో మెప్పించినప్పటికీ, అది కూడా అనుకున్నంత హిట్ కాలేదు. తర్వాత క్రమంగా నవీన్ కనుమరుగైపోయాడు. పదేళ్ల పాటు సినిమానే చేయని ఆయన్ని ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు.

కానీ ఆశ్చర్యకరంగా సుదీర్ఘ విరామం తర్వాత నవీన్ హీరోగా సినిమా చేశాడు. ఆ చిత్రమే.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. మామూలుగా కెరీర్లో ఇంత గ్యాప్ వచ్చాక సీనియర్ హీరోలు క్యారెక్టర్ రోల్స్‌కు మారిపోతుంటారు. కానీ నవీన్ మాత్రం ఎంతో ధీమాగా హీరోగా సినిమా చేశాడు. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా క్రైమ్ థ్రిల్లర్ కథలో నటించాడు నవీన్. ఈ సినిమా ప్రోమోలు ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అన్నది సందేహమే.

కానీ ట్రెండీ కథను సరిగ్గా డీల్ చేసి ఉన్నట్లయితే.. పాజిటివ్ రివ్యూలు, టాక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించొచ్చు. ఇటీవల సీనియర్ నటుడు అర్జున్ ‘బ్లాస్ట్’ మూవీతో సర్ప్రైజ్ హిట్ కొట్టాడు. ఆ సినిమా మీదా ముందు ఎలాంటి అంచనాల్లేవు. కానీ పాజిటివ్ టాక్, రివ్యూలు సినిమాకు ప్లస్సయి సినిమా హిట్టయింది. మరి నవీన్ అండ్ టీమ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా కూడా ఇలాగే మెప్పించి హిట్టు కొడతాడేమో చూడాలి.