బుచ్చిబాబు రాజీ పడకుండా ఉంటే

పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను వెంటాడుతున్న మాట వాస్తవం. ఒక పక్క కొందరు చేసిన ఉద్దేశపూర్వక రివ్యూలు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం చేశాయి. ఇంకోవైపు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ హీరోయిన్ ని గ్లామరస్ గా చూపించలేదన్న రేంజ్ లో జాన్వీ కపూర్ పాత్ర మీద ఎడతెగని డిస్కషన్లు జరిగాయి. సరే ఇవేవి విజయాన్ని, వసూళ్లను ఆపలేకపోయాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ బుచ్చిబాబు లెన్త్ విషయంలో రాజీ పడటం గురించి ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జగపతిబాబు పోస్ట్ రిలీజ్ తర్వాత ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెబుతున్న సంగతులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తనకు, రామ్ చరణ్ కు మధ్య మంచి బాండింగ్ అనిపించే పెళ్లి చూపుల సీన్లను ఎడిటింగ్ లో తీసేశారని, ఎందుకని అడిగితే బుచ్చిబాబు నిడివి గురించి చెప్పి తప్పించుకున్నాడని, అసలు ఎందుకు ఇలా చేసారో అర్థం కాలేదని అన్నారు.

ఒకరకంగా చూసుకుంటే బుచ్చిబాబు కాంప్రోమైజ్ కాకపోయి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే దురంధర్ ది రివేంజ్ 4 గంటలు ఉన్నా జనం ఎగబడి చూశారు. పుష్ప 2, యానిమల్ మూడున్నర గంటలకు దగ్గరగా ఉన్నా ఇబ్బంది అనిపించలేదు. అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాంటప్పుడు కేవలం పెద్దికి మాత్రమే ఇది సమస్య అవుతుందని అనుకోవడానికి లేదు. ఢిల్లీ ఎపిసోడ్ లో ఎమోషన్ కాస్త తగ్గించి వీటిని బ్యాలన్స్ చేసినా పర్ఫెక్ట్ అయ్యేది.

ఎందుకంటే జాన్వీకి అవమానం జరిగిన ఎపిసోడ్ తర్వాత ఎంటర్ టైన్మెంట్ ఉండదు. పెద్ది గౌర్ నాయుడు దగ్గర చేరిన తర్వాత వినోదం కనిపించదు. అలాంటప్పుడు ముందే పెళ్లి చూపులు గట్రా ఎపిసోడ్లు, కత్తిరింపులకు గురైన ఫైట్లు లాంటివి పెట్టి ఉంటే మాస్ ఇంకా హ్యాపీగా ఫీలయ్యేవాళ్ళు. పెద్దికి ఇప్పుడేదో నష్టం జరిగిందని కాదు కానీ అన్నీ ఉంటే ఉత్తరాదిలో ఇంకా బలంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో. పుష్ప లాగా కంప్లీట్ ప్యాకేజ్ ఫీలయ్యేవాళ్లేమో. జస్ట్ చిన్న ఐడియా.