పేరు చెడిపోతోంది నానీ…

టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆల‌స్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌, దాన్ని మార్చ‌కుండా చెప్పిన తేదీకి వ‌చ్చే చిత్రాలు చాలా అరుదైపోయాయి. ఒక‌టికి మించి డేట్లు మార్చుకుంటున్న చిత్రాలు చాలానే ఉంటున్నాయి. క‌రోనా త‌ర్వాత ఈ ప్రాక్టీస్‌కు జ‌నం కూడా అల‌వాటు ప‌డిపోయారు. వాయిదా వార్త‌ల‌ను లైట్ తీసుకుంటున్నారు.

డేట్ మార్చ‌డాన్ని ఒక‌ప్ప‌ట్లా ఎవ్వ‌రూ నెగెటివ్ సెంటిమెంటుగా భావించ‌ట్లేదు. ఐతే ఇలాంటి టైంలోనూ కాబోయే స్టార్ హీరోల్లో ఒక్క నేచుర‌ల్ స్టార్ నాని మాత్ర‌మే.. ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అడుగులు వేస్తూ వ‌చ్చాడు. వేగంగా సినిమాలు చేస్తూనే క్వాలిటీ త‌గ్గ‌కుండా చూసుకుంటూ.. చెప్పిన డేట్‌కు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తెస్తాడ‌నే గుర్తింపును సంపాదించుకున్నాడు నాని.

అందుకే త‌న మార్కెట్ ఇంతింతై అన్న‌ట్లు పెరుగుతూ వ‌చ్చింది. తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల్లోనూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొని.. త‌న సినిమాల‌కు భారీ వ్యూయ‌ర్‌షిప్ వ‌చ్చేలా చేసుకున్నాడు.

నాని కొత్త సినిమా ది ప్యార‌డైజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో బంప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమాతో నాని కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంద‌నే అంచ‌నాలు క‌లిగాయి. సినిమాకు హైప్ అయితే బాగానే వ‌చ్చింది కానీ.. షూటింగ్ ఎంత‌కీ పూర్తి కాక‌పోవ‌డం.. రిలీజ్ ఎప్పుడో తెలియ‌ని అయోమ‌యం నెల‌కొన‌డం ప్ర‌తికూలంగా మారింది. ఈ సినిమాను కూడా నాని చెప్పిన‌ట్లే మార్చి చివ‌రి వారంలో రిలీజ్ చేసేస్తాడ‌ని భావించారు అభిమానులు.

కానీ మార్చి నుంచి ఏకంగా ఆగ‌స్టు 21కి వాయిదా ప‌డింది. డేట్ మార్చిన‌పుడు కొంత అసంతృప్తి వ్య‌క్త‌మైనా.. భారీ కాన్వాస్‌లో తెర‌కెక్కుతున్న సినిమాకు కొంచెం టైం ప‌డుతుందిలే అని స‌ర్దుకున్నారు ఫ్యాన్స్. కానీ తాజా ప‌రిణామాలు చూస్తుంటే ఆగ‌స్టు 21న కూడా సినిమా వ‌చ్చేలా లేదు. ఇరుముడి చిత్రానికి అదే డేట్ ఖాయం చేయ‌డంతో ది ప్యార‌డైజ్ వాయిదా ఖాయం అనే వార్తలు జోరందుకున్నాయి.

నిజానికి ది ప్యారడైజ్ వాయిదా గురించి కొన్ని నెల‌ల ముందే ఒక ప్ర‌చారం జ‌రిగింది. ఈ మూవీ బ‌డ్జెట్ హ‌ద్దులు దాటిపోయింద‌ని, షూటింగ్ స‌జావుగా సాగ‌ట్లేద‌ని.. సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో, ఎప్పుడు రిలీజ‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ టీం వ‌ర్గాలు ఆ ప్ర‌చారాన్ని ఖండిస్తూ, ఆగ‌స్టు 21నే సినిమా వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశాయి.

కానీ తాజా ప‌రిస్థితి చూస్తుంటే అప్పుడు జ‌రిగిన ప్ర‌చారం నిజ‌మే అనిపిస్తోంది. ఈ సినిమా నాని కంట్రోల్లో ఉందా లేదా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఈ సినిమా లేట‌వ‌డం వ‌ల్ల సుజీత్‌తో చేయాల్సిన బ్ల‌డీ రోమియో సంగ‌తీ ఎటూ తేల‌కుండా పోయింది. మొత్తంగా చూస్తే ది ప్యార‌డైజ్ సినిమా నాని కెరీర్‌ను మరో లెవ‌ల్‌కు తీసుకెళ్తుందో లేదో కానీ.. ప్లానింగ్ విష‌యంలో త‌న‌కున్న పేరును చెడ‌గొడుతోంది.