రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన ప్రవర్తనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. అవసరం లేని రాజకీయ మకిలి అంటించుకుని అప్రతిష్ట పాలైనా.. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టినా.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఎక్కడైనా ఒక స్పీచ్ ఇచ్చినా.. ఎంతో ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు.
వర్మ మంచి సినిమా తీస్తే ఆదరించడానికి కూడా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య రాజకీయాలకు రాంరాం చెప్పే, కొంచెం పద్దతిగా మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ.. తాను మారిన మనిషిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. హిందీలో ‘పోలీస్ స్టేషన్ మే బూత్’ అనే సినిమా కూడా తీసి, ఇంకో భారీ చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో వర్మ ఇంకో వినూత్నమైన ప్రయోగానికి రెడీ అయిపోయారు.
తాను చనిపోయినా సరే.. ఎప్పటికీ బతికి ఉండేలా ఏఐ ద్వారా తన క్లోన్‌ను రెడీ చేయించాడు వర్మ. హరి గడిపూడి అనే ఒక ఔత్సాహిక ఏఐ ఇంజినీర్ వర్మ కోసం ఈ క్లోన్ తయారు చేశాడు. ఈ క్లోన్ ఆర్జీవీ పేరు మీద ఇకపై ఒక పేజీ నడవబోతోంది. అందులో వర్మను ఏ టాపిక్ మీద అయినా ప్రశ్నలు అడగొచ్చు. వర్మ క్యారెక్టర్ మీద స్టడీ చేసి తయారు చేసిన ఆ క్లోన్ క్యారెక్టర్.. అచ్చం వర్మ లాగే సమాధానాలు ఇస్తుంది. వర్మతో మాట్లాడుతున్న ఫీలింగే కలిగించేలా ఏఐ ద్వారా ఈ క్లోన్ క్యారెక్టర్ సృష్టించారన్నమాట.
ఇది వర్మ అభిమానులకు ఎంతో ఉత్సాహం కలిగించే విషయమే. వర్మ దీని గురించి ఎగ్జైట్ అవుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. తాను చనిపోయినా కూడా జీవించి ఉండే విషయం ఇదంటూ దీన్ని తయారు చేసిన ఏఐ ఇంజినీర్‌ను కొనియాడాడు. ఆల్రెడీ ఈ క్లోన్ క్యారెక్టర్‌తో నెటిజన్లు ప్రయోగాలు మొదలుపెట్టేశారు. మున్ముందు మిగతా సెలబ్రెటీలు కూడా ఇలాంటి వాటి వైపు అడుగులు వేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates