చిరంజీవి పేరులో ఆ లెటర్ మిస్సయితే

మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించి ఒక సీజన్లో తళుక్కుమన్నారు. కానీ ఆశించిన స్పందన లేకపోవడంతో తర్వాతి సీజన్‌కు ఆయన ఆ షోను హోస్ట్ చేయలేదు. అయినా సరే చిరు ఏమీ ఆగిపోలేదు. ఇప్పుడు మళ్లీ ఒక టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈసారి ఆయన షో చేస్తున్నది డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసం.

స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌తో మెగాస్టార్ చేతులు కలపడం.. దాని కోసం ‘మెగావర్స్’ అనే షో చేస్తుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇంకా షూటింగ్ నడుస్తోంది. మరోవైపు ఈ షో గురించి ప్రమోషన్లు మొదలుపెట్టేసింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. హైదరాబాద్ సహా కొన్ని సిటీల్లో ఇంట్రెస్టింగ్ పోస్టర్లు వెలిశాయి.

Chiranjeevi అనే పేరుతో ‘N’ లెటర్ తీసేసి పోస్టర్లు వేయగా.. ఎన్ అక్షరం ఎందుకు మిస్సయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీని మీదే ఇప్పుడో వీడియో ప్రోమో కూడా వదిలారు. చిరంజీవి పేరులో మిస్ అయిన ఎన్ అక్షరం గురించి అందరూ ఆశ్చర్యపోతుంటే.. దాన్ని NETFLIX లోని N అక్షరంతో పూరించి, త్వరలోనే షో మొదలుకాబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు ఈ ప్రోమోలో. కొంచెం క్రియేటివ్‌గానే ఈ ప్రోమోను కట్ చేశారు. 

మెగావర్స్ ఫస్ట్ ఎపిసోడ్‌లో చిరుకు అత్యంత సన్నిహితుడైన అక్కినేని నాగార్జునతో ఆయన తనయుతు నాగచైతన్య, అఖిల్ కనిపించబోతున్నారని సమాచారం. ఇంకా ప్రభుదేవా-తమన్.. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ.. పవన్ కళ్యాణ్-రామ్ చరణ్.. రవితేజ-నాని జోడీలు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌లో సందడి చేస్తాయని అంటున్నారు. డిసెంబరులో ఈ షో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.