దర్శకుడి వల్లే ఓమ్ లెక్క తప్పింది 

అమరన్ వచ్చినప్పుడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామీ పేరు మారుమ్రోగింది. ఒక వీర సైనికుడి బయోపిక్ ని ఎమోషనల్ గా తెరకెక్కించిన తీరు వందల కోట్ల వసూళ్లు తెచ్చింది. కమర్షియల్ హంగులు లేకుండా శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటను హ్యాండిల్ చేసిన తీరు, ఆడియెన్స్ హృదయాలను తడి చేసిన వైనం ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది. అందుకే ధనుష్, మమ్ముట్టి మరో ఆలోచన లేకుండా ఓమ్ కి ఎస్ చెప్పారు. ధనుష్ స్వయంగా నిర్మాతగా మారి భారీ బడ్జెట్ ఇచ్చాడు.

తీరా చూస్తే మొదటి మూడు రోజుల తర్వాత ఓమ్ బాగా నెమ్మదించింది. విచిత్రంగా ఏపీ, తెలంగాణ, కేరళలో స్ట్రాంగ్ నెంబర్లు కనిపించగా తమిళనాడులో ఫ్లాప్ దిశగా వెళ్తోందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కారణం ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాజ్ కుమార్ పెరియసామీ దానికి తగ్గ కంటెంట్ ఇవ్వకపోవడమే. ముఖ్యంగా సెకండాఫ్ మీద చాలా కంప్లైంట్స్ వినిపించాయి. తండ్రి చనిపోయిన తర్వాత ధనుష్ పాత్రని నడిపించిన విధానం, మమ్ముట్టిని అండర్ ప్లే చేయడం రెండూ తేడా కొట్టాయి.

ఓమ్ రెండో సగంలో అడవిలో పోలీసుల నుంచి మలయాళీలను కాపాడే ఎపిసోడ్ తప్ప ఇంకేదీ కోరుకున్న హై ఇవ్వలేదన్నది వాస్తవం. క్లైమాక్స్ లో సాయిపల్లవి పాత్ర ద్వారా భావోద్వేగం రగిలించినప్పటికీ జైలు ప్రహసనం మొత్తం కమల్ హాసన్ పోతురాజు నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ధనుష్, మమ్ముట్టి మధ్య బాండింగ్ ని సరైన రీతిలో వాడుకోకపోవడం పెద్ద మైనస్. దళపతి స్థాయిలో ఊహించుకుంటే దాంట్లో కనీసం పావు వంతు రాజ్ కుమార్ మ్యాచ్ చేయలేకపోయారు.

ట్విస్టులు కూడా ఊహించేలా ఉండటం ఫ్లోని సరైన రీతిలో వెళ్లకుండా అడ్డుపడింది. సాయి అభ్యంక్కర్ నుంచి బెస్ట్ బిజిఎం రాబట్టుకోలేకపోవడం దర్శకుడి ఫాల్టే. అమరన్ ని అంత పకడ్బందీగా రాసుకున్న రాజ్ కుమార్ పెరియసామి ఈ ఓమ్ విషయంలో తడబాటు చూపించడం చాలా నష్టం చేసింది. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసేదని కోలీవుడ్ బయ్యర్లు చెబుతున్న మాట అక్షర సత్యం. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యింది.