కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది ఒక మైనర్ మీద లైంగిక వేధింపుల కేసులో కావడం గమనార్హం. ఆయనకున్న పేరుకు ఇలాంటి కేసును ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.
దీని మీద ప్రముఖ గాయని-డబ్బింగ్ ఆర్టిస్ట్.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న చిన్మయి శ్రీపాద స్పందించింది. భాస్కర్ బాధితులు అనేకమంది నుంచి తనకు ఎన్నో మెసేజ్లు వస్తున్నట్లు, అందులో చాలామంది మైనర్లు ఉన్నట్లు.. వారికి తన వైపు నుంచి పూర్తి సహకారం అందించబోతున్నట్లు చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడించింది.
‘‘ఈ శాస్త్రీయ సంగీత విధ్వాంసుడి బాధితుల కథలు చాలా ఉన్నాయి. వాటిని బయటపెట్టలేను. వారి కథలను వెల్లడించడం, స్క్రీన్ షాట్లు పోస్ట్ చేయడం వంటివి చేయలేను. ఈ వ్యక్తి గురించి గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. అతడితో కలిసి పని చేసిన మహిళలతో సహా కర్ణాటక సంగీతానికి సంబంధించిన వాళ్లెవ్వరూ దీనిపై స్పందించలేదు. మళ్లీ ఇలాంటివి జరిగితే చెప్పండని మాత్రమే బాధితులతో అన్నారు.
బాధితులంతా చిన్న వయస్కులు. ఈ కేసుల్లో కొన్ని పోక్సో చట్టం కిందికి వస్తాయి. వాళ్లందరికీ సరైన న్యాయ సహాయం అందేలా చూస్తాను. సానుభూతితో వ్యవహరించే న్యాయవాదుల వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తారు. దయచేసి అందరూ ఒక్కటై ముందుకు వచ్చి కేసులు నమోదు చేయండి. మీకు మద్దతు లభిస్తుంది’’ అని చిన్మయి సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఈ విషయమై చిన్మయి మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates