పెద్ది ఇక్కడ సూపర్… మరి అక్కడ?

సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్‌ ఎలా ఉందన్నదాంతో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్‌కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. నిన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ ఇటు ఏపీలో, అటు తెలంగాణలో మోతెక్కిపోయాయి. మెజారిటీ షోలకు ఫుల్స్ పడిపోయాయి. దీంతో తెలుగులో ఆల్ టైం పెయిడ్ ప్రిమియర్స్ రికార్డును ‘పెద్ది’ సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక గురువారానికి కూడా బుకింగ్స్‌‌కు ఢోకా లేదు. సినిమా వీకెండ్ వరకు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచేలా కనిపిస్తోంది. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ వసూళ్ల మోత మోగిస్తుందనే విషయంలో ముందు నుంచి ఎవరికీ సందేహాలు లేవు. కానీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న ఈ చిత్రం.. ఇతర భాషల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఐతే ‘పెద్ది’ తెలుగు రాష్ట్రాలను దాటి కర్ణాటకలో మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది. అక్కడ పెద్ద తెలుగు సినిమాలకు ఎప్పుడూ మంచి రెస్పాన్సే ఉంటుంది. కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఉండే తెలుగువాళ్లకు కన్నడిగులు సైతం తెలుగు సినిమాలను బాగా చూస్తారు. శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర చేసిన నేపథ్యంలో ‘పెద్ది’ కన్నడ వెర్షన్‌ను కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేశారు. దానికీ రెస్పాన్స్ బాగుంది.

ఐతే తమిళం, మలయాళంలో మాత్రం ‘పెద్ది’ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. ఐతే చిత్ర బృందానికి తమిళం, మలయాళం కంటే హిందీ మార్కెట్ కీలకం. అక్కడ సినిమా క్లిక్ అయితే సినిమా రేంజ్ మారిపోతుంది. వసూళ్లు ఊహించని స్థాయిలో ఉంటాయి.

‘పుష్ప’ స్థాయిలో కాకపోయినా.. ఒక మోస్తరు కలెక్షన్లు ఉంటాయని ఆశిస్తున్నారు. ఐతే ఫస్ట్ టీజర్, చికిరి పాట వల్ల ‘పెద్ది’కి అక్కడ బజ్ క్రియేట్ అయినా.. అడ్వాన్స్ బుకిింగ్స్‌లో అది ప్రతిఫలించడం లేదు. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా లాంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే షోలు ఇచ్చారు. కానీ బుకింగ్స్ ట్రెండ్ స్లోగా ఉంది.

ఐతే హిందీలో సౌత్ సినిమాల కోసం ఒకేసారి ప్రేక్షకులు ఎగబడిపోరు. టాక్ చూసుకుని నెమ్మదిగా థియేటర్లకు కదులుతారు. హిందీలో పేరున్న క్రిటిక్స్ ‘పెద్ది’కి పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా నెమ్మదిగా పుంజుకుంటుందేమో చూడాలి.