మూకుమ్మడిగా జాన్విపై పడిపోతున్నారు

ఈ ఏడాది ఇండియా మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘పెద్ది’ థియేటర్లలోకి దిగేసింది. అఫీషియల్ రిలీజ్ ఈ రోజే అయినా.. నిన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్‌తోనే పెద్ది సందడి మొదలైపోయింది. సినిమా టీం చెప్పినంత గొప్పగా లేని మాట వాస్తవం. కానీ ఇది మంచి సినిమా అనడంలో సందేహం లేదు. కొన్ని కంప్లైంట్లు ఉన్నప్పటికీ.. చాలా వరకు సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది.

కేవలం రామ్ చరణ్ పాత్ర, పెర్ఫామెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చనడంలో మరో మాట లేదు. చరణ్ మాత్రం తన మీద పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గని పెర్ఫామెన్సే ఇచ్చాడు. ఈ పాత్ర మీద దర్శకుడు బుచ్చిబాబు సానా పెట్టిన శ్రద్ధ ప్రశంసనీయం. ఐతే ఒక శిఖరంలా నిలబడ్డ పెద్ది పాత్రకు సరైన జోడీని పెట్టడంలో మాత్రం బుచ్చిబాబు ఫెయిలయ్యాడు.

ఒక మంచి కథ రాసి, బలమైన ఎమోషన్లతో ప్రేక్షకులను కదిలించేలా సినిమా తీసిన బుచ్చిబాబు.. హీరోయిన్ విషయంలో మాత్రం మరీ స్టీరియో టైప్‌లో ఆలోచించాడన్నది ప్రేక్షకుల కంప్లైంట్.

‘చికిరి చికిరి’ పాట.. ట్రైలర్ చూసినపుడే చాలామంది జాన్వి అప్పీయరెన్స్ విషయంలో పెదవి విరిచారు. అసలు ఏ ఊరిలో అయినా అమ్మాయి, అది కూడా ఎమ్మెల్యే కూతురు ఇలా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రోమోలతోనే ఈ పాత్ర మీద సరైన అభిప్రాయం కలగకపోగా.. సినిమా చూశాక మరింత ఫీలింగ్ మరింత నెగెటివ్‌గా మారుతుంది.

ఇటు విమర్శకులు, ఇటు సామాన్య ప్రేక్షకులు అందరూ మూకుమ్మడిగా ఈ పాత్ర తీరును తప్పుబడుతున్నారు. సినిమాలో మైనస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నది జాన్వి విషయంలోనే. బుచ్చిబాబు ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరే బాగా లేకపోగా.. జాన్వి నటన కూడా పేలవంగా ఉండడంతో అందాల విందు చేయడం తప్ప ఆమెలో ఏం టాలెంట్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘దేవర’ విషయంలోనూ జాన్వి ఇలాంటి విమర్శలే ఎదుర్కోగా.. ఈసారి విమర్శల జడి ఇంకా పెరిగేలా ఉంది. హిందీలో కొన్ని చిత్రాల్లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన జాన్వికి.. తెలుగులో మాత్రం ఇలాంటి పాత్రలే పడుతుండడం తన దురదృష్టం అనే చెప్పాలి.