లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు సీఎం, సహనటుడు విజయ్ ని కలిశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ ఆయన కొన్ని డిమాండ్లను నూతన ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వాటిలో ఓటిటికి 8 వారాల విండోని తప్పనిసరి చేయడం ఉంది. అధిక శాతం తమిళనాడులో షూటింగ్ జరుపుకున్న సినిమాలకు 10 శాతం రాయితీతో పాటు 4 శాతం ఎంటర్ టైన్మెంట్ టాక్స్ తీసేయమని కోరారు. ఇదంతా బాగానే ఉంది కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం.
సినిమా అనేది నిర్మాత సొత్తు. దాని మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పన్నులు, షోల పరిమితులు, సెన్సార్ లాంటి వ్యవహారాలు తన కంట్రోల్ లో ఉంటాయి కానీ ఎంతకు అమ్మాలి, ఎంత నిడివిలో ఓటిటికి ఇవ్వాలనేది ప్రొడ్యూసర్ ఇష్టం. గవర్నమెంట్ వచ్చి నువ్వు రెండు నెలల తర్వాత డిజిటల్ లో ఇవ్వాలని రూల్ పెడితే చట్టప్రకారం చెల్లదు. దానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకుని అన్ని పార్టీల మద్దతు పొందాలి. ఎవరైనా కేసు వేస్తే దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాలి.
ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలో అగ్ర నిర్మాతలు ఎనిమిది వారాల ఓటిటి విండోకి ఒప్పుకోవడం లేదు. నాలుగు వారాల నిడివి వల్లే పెట్టుబడులు రికవర్ అవుతున్నాయని, ఇప్పుడు దాన్ని సవరిస్తే ఓటిటి కంపెనీలు పెద్ద కోత పెడతాయని అంటున్నాయి. కమల్ నుంచి మరో డిమాండ్ ఉంది. ప్రభుత్వమే ఒక ఓటిటి ఏర్పాటు చేసుకుని సరసమైన ధరలకు వినోదాన్ని అందించడం. ఇది ఇంకా కష్టం.
ఎందుకంటే సంక్షేమానికే నిధులు లేక రూలింగ్ పార్టీలు కిందామీదా పడుతున్న టైంలో నిర్మాతల దగ్గర భారీ డబ్బులకు ఓటిటి హక్కులు కొని దాన్ని తక్కువ రేట్లకు ఆడియన్స్ కి ఇచ్చి ఇదంతా మైంటైన్ చేయడం లేనిపోని శిరోభారం. అయితే విజయ్ సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వీటిలో దేని గురించైనా సానుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. అయినా స్టాలిన్ ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చిన కమల్ హాసన్ కు ఆ టైంలో ఇవేవి గుర్తుకు రాకపోవడం, అడగకపోవడం మహా విచిత్రం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
