దక్షిణాది సినిమా ముఖచిత్రాన్ని మార్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కూడా అపరిచితుడు, రోబో లాంటి అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించారాయన. కానీ గత దశాబ్ద కాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. ముఖ్యంగా గత రెండేళ్లలో ఇండియన్-2, గేమ్ చేంజర్ చిత్రాలతో కెరీర్లో పతనం చవిచూశాడు శంకర్.
రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా ‘వేల్పారి’ అనే భారీ చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి భారీ బడ్జెట్, కాస్టింగ్ అవసరం కావడంతో ప్రాజెక్టు కొంచెం లేటవుతోంది. ఈలోపు శంకర్.. ముఖానికి రంగు వేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని విలన్ పాత్రలో చూపించాలని యువ దర్శకుడు శిబి చక్రవర్తి చూస్తున్నాడట.
శంకర్ విలన్ పాత్ర పోషించబోయేది సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో అని వార్తలు వస్తున్నాయి. తన 173వ చిత్రాన్ని శిబి దర్శకత్వంలో చేయడానికి రజినీ రెడీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ముందు సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా చేయాలనుకున్న రజినీ.. తర్వాత శిబిని లైన్లోకి తీసుకొచ్చాడు. ఈ చిత్రం నుంచి శిబి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. శిబి దర్శకత్వంలోనే రజినీ నటిస్తాడని అంటున్నారు.
ఈ సినిమాకు కొత్త లుక్ తీసుకొచ్చేందుకు శిబి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా రజినీని సరికొత్త అవతారంలో చూపించడమే కాదు.. కొత్త విలన్‌ను కూడా తీసుకురావాలని చూస్తున్నాడు. శంకర్‌తో ఆ పాత్ర చేయించాలన్నది అతడి ఆలోచనట. మరి ఇప్పటిదాకా నటన వైపే చూడని శంకర్ ఒకేసారి సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్ర అంటే.. మెప్పించగలడా అన్నది సందేహం. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ రజినీకి జోడీగా నటిస్తుందని అంటున్నారు. త్వరలో దీని గురించి క్లారిటీ రావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates