తారక్ ఫ్యాన్స్ గోల గోల

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయిన సినిమా ‘డ్రాగన్’యే. కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడమే అందుకు ముఖ్య కారణం. మధ్యలో ‘దేవర’ సినిమా బాగానే ఆడినా వారికి పూర్తి సంతృప్తినివ్వలేదు. ఇక ‘వార్-2’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

గత ఏడాది తగిలిన ‘వార్-2’ గాయానికి ఈ ఏడాది తారక్ ‘డ్రాగన్’తో మందు వేస్తాడన్న ఆశతో ఉన్నారు. ఈ సినిమాను రాబోయే జూన్‌లో రిలీజ్ చేస్తామని ఇంతకుముందు ప్రకటించినప్పటికీ.. అప్పుడు ఈ సినిమా రాదని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. అప్పడు కాకపోయినా.. ఈ ఏడాది చివరికైనా రిలీజైతే చాలు అనుకుంటున్నారు. ఆ డేట్ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా 2027 జూన్‌కు వాయిదా పడిపోయింది. ఆ నెల 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ పోస్టర్ రిలీజైన దగ్గర్నుంచి తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఔట్ పుట్ బాగుండడం కోసం టైం తీసుకుంటే మంచిదే కానీ.. మరీ ఇంతలా ఆలస్యం చేయడం ఏంటి అని వారు ప్రశాంత్ నీల్ మీద మండిపడుతున్నారు. ఏడాది ముందే షూట్ మొదలుపెట్టిన టీం.. ఇంకా షూట్‌ను ఒక కొలిక్కి తీసుకురాకపోవడం.. ఇంకో 14 నెలల తర్వాత సినిమాను రిలీజ్ చేసే పరిస్థితిలో ఉండడం వారికి అసహనం కలిగిస్తోంది. కనీసం వచ్చే ఏడాది సంక్రాంతికైనా విడుదల చేయాల్సిందని.. మరీ ఇంత సుదీర్ఘ నిరీక్షణ అంటే కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నవే. కానీ అభిమానుల ఓపికను మరీ పరీక్షించేలా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. మళ్లీ మళ్లీ రిలీజ్ డేట్లు మార్చుకుంటున్నాయి. అందరు స్టార్ల అభిమానులకు ఈ ఫ్రస్టేషన్ తప్పట్లేదు. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజు కానుకగా ‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించడం మాత్రం కాస్త ఊరట.

నిజానికి ఆ రోజే రిలీజ్ డేట్ ప్రకటించాలని అనుకున్నా.. అంత లేటుగా రిలీజ్ అంటే ఆ రోజు అభిమానులు నిరాశపడతారు కాబట్టి.. ఇప్పుడే విషయాన్ని ప్రకటించి జీర్ణించుకునేలా చేయడానికే ఇప్పుడీ పోస్టర్ రిలీజ్ చేసినట్లు కనిపిస్తోంది. డ్రాగన్ అన్నది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కాగా.. దాన్నే ఫైనల్‌ చేస్తారా, కొత్త పేరు ఉంటుందా అన్నది కూడా మే 20న తేలిపోతుంది.