రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో అంతకన్నా ఎక్కువే చేశారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిన్న మూవీకి నిర్మాత కిరణ్ అబ్బవరం చేసిన ప్రచారం నిజంగా ఆకట్టుకునేలా సాగింది. నిన్న టీమ్ మొత్తానికి ప్రసాద్ బిగ్ స్క్రీన్ లో ప్రీమియర్ వేయడం ద్వారా ఫైనల్ చాప్టర్ పూర్తి చేశారు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ట్వీట్లు ఒకటా రెండా ఏదో తోస్తే అది చేసుకుంటూ పోయారు.
‘పాపం ప్రతాప్’ సైతం నేనేం తీసిపోలేదనే తరహాలో పోటాపోటీగా ప్రమోషన్లు చేసుకుంది. తిరువీర్ రెండు వారాలుగా నిద్రాహారాలు మాని మరీ ఆడియన్స్ కళ్ళలో పడేందుకు బాగా కష్టపడ్డాడు. ఈటీవీ విన్ నిర్మాణం కావడంతో ప్రమోషన్ విషయంలో బోలెడంత సపోర్ట్ దొరికింది. ముఖ్యమైన ట్విస్టుని నిన్న సోషల్ మీడియాలో రివీల్ చేయడం ద్వారా మరింత బజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. మలయాళం డబ్బింగ్ మూవీ ‘పల్లిచట్టంబి’కి ప్రస్తుతానికి ఎలాంటి బజ్ కనిపించడం లేదు.
నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ కూడా వీటితో పాటే వస్తోంది. ప్రమోషన్ల విషయంలో టీమ్ పైన చెప్పిన వాటంత దూకుడుగా లేదు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలు పెంచలేకపోయాయి కానీ థియేటర్లో సర్ప్రైజ్ ఇస్తుందని నిర్మాత ధీమాగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప పెద్దగా హడావిడేం చేయలేదు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ మూవీ ‘భూత్ బంగ్లా’కు ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు. ‘లీ క్రోనిన్స్ మమ్మీ’ మీద హారర్ లవర్స్ ఆసక్తిగానే ఉన్నారు.
మిస్టర్ ఎక్స్, తెరచాప, కాలగమనం, గాలి అనే మరో నాలుగు స్ట్రెయిట్ సినిమాలు వీటిలో పాటు వస్తున్నాయి. కౌంట్ అయితే పెద్దదే ఉంది కానీ బుక్ మై షో గమనిస్తే ఏ ఒక్కటి గంటకు లేదా ఇరవై నాలుగు గంటలకు సంబంధించి ఏ సినిమా ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు. అంటే ఆడియన్స్ టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైపోయింది. డెకాయిట్, బైకర్, రాకాసలు నెమ్మదిస్తున్నాయి. కొత్త వీకెండ్ లో ఆ అవకాశాన్ని కొత్త రిలీజుల్లో ఏవి అంది పుచ్చుకుంటాయో రేపటికి తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
