రాను రాను రీ రిలీజులు చాలా రిస్కీ వ్యవహారాలుగా మారిపోతున్నాయి. ఏది వర్కౌట్ అవుతుందో ఏది పోతుందో ముందే పసిగట్టడంలో డిస్ట్రిబ్యూటర్లు విఫలమవుతున్నారు. అలాంటిదే ఒకటి మలయాళంలో జరిగింది. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని పరిచయం చేసి కోట్ల వసూళ్లు ఎలా కొల్లగొట్టవచ్చో నిరూపించిన బ్లాక్ బస్టర్ గా దృశ్యం ఎంత చరిత్ర సృష్టించిందో తెలిసిందే. 2013లో రిలీజైన ఈ క్లాసిక్ ని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కొంత గ్యాప్ తర్వాత దృశ్యం 2 కరోనా పరిస్థితుల వల్ల 2021లో నేరుగా ఓటిటిలో రిలీజయ్యింది. తెలుగులో కూడా డిజిటల్ బాట పట్టింది. త్వరలో దృశ్యం 3 రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో రెండో భాగాన్ని థియేటర్ రిలీజ్ చేసి కాసింత డబ్బులు చేసుకుందామని ప్లాన్ చేసుకున్న మలయాళ నిర్మాతలకు షాక్ కొట్టింది. ఏప్రిల్ 10 విడుదల చేస్తే అయిదు లక్షల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయని మల్లువుడ్ టాక్. అంటే పబ్లిసిటీ ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ వ్యయం కూడా వెనక్కు రాలేదు.
అయినా క్రైమ్ థ్రిల్లర్స్ లో సెలెబ్రేట్ చేసుకునే అంశాలు తక్కువగా ఉంటాయి. సస్పెన్స్ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి మరోసారి దాన్ని ఎంజాయ్ చేయలేరు. అందులోనూ పాటలు, ఫైట్లు లేని దృశ్యం లాంటివి మళ్ళీ థియేటర్లో చూడాలని జనాలు కోరుకోరు. అందుకే వెంకటేష్ అభిమానులు అప్పట్లో ఒత్తిడి చేసినా సురేష్ బాబు చలించకుండా దృశ్యం 2ని డైరెక్ట్ ఓటిటికి ఇచ్చారు. నారప్ప కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యాక లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ చేశారు.
దీని సంగతలా ఉంచితే ఇరాన్ లో యుద్ధ వాతావరణం దృష్ట్యా దృశ్యం 3 విడుదల వాయిదా పడింది. మేలో ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ వేరే కథతో రూపొందుతుండగా తెలుగులో చేసేందుకు వెంకటేష్ అంత సుముఖత చూపించలేదని ఇన్ సైడ్ టాక్. ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న వెంకీ డిసెంబర్ దాకా దొరికేలా లేరు. ఆలోగా దృశ్యం 3 మలయాళం, హిందీ తాలూకా ట్విస్టులు అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో తెలుగులో తీస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
