దురంధర్.. గత నాలుగు నెలలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశం అవుతున్న సినిమా. గత డిసెంబరులో వచ్చిన ‘దురంధర్’ రెండు నెలల పాటు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. తర్వాతి నెల రోజులు ఓటీటీలో ఆ సినిమా ప్రకంపనలు రేపింది. ఇంతలోనే ఇప్పుడు ‘దురంధర్-2’ రిలీజై వసూళ్ల మోత మోగిస్తోంది. ఆల్ టైం ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఐతే ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాను విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా తీసిన సినిమా అని.. ఇందులో ఎన్నో అబద్ధాలు ఉన్నాయని ఒక వర్గం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. స్వయంగా బాలీవుడ్ నుంచే ఈ సినిమాను వ్యతిరేకించే వారి సంఖ్య పెద్దగానే ఉంది. అందుకే తమ ఇండస్ట్రీ గర్వించే స్థాయి విజయం సాధించినా.. దాన్ని కొనియాడట్లేదు. తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది బీజీపే వ్యతిరేక అజెండాతో ఉంటారన్న సంగతి తెలిసిందే. అక్కడి వాళ్లకూ ఈ సినిమా రుచించట్లేదు.
ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుల్లో ఒకడైన వెట్రిమారన్.. ‘దురంధర్’ పేరెత్తకుండా ఆ సినిమా మీద విమర్శలు గుప్పించాడు ఒక సినిమా ఈవెంట్లో. ‘నీలిర’ అనే సినిమా ఈవెంట్లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘దురంధర్’ పేరెత్తకుండా దాన్ని ప్రాపగండా మూవీగా పేర్కొన్నాడు. డీమానిటైజేషన్ టైంలో ఎంతోమంది క్యూల్లో నిలబడి నానా అవస్థలు పడ్డారని.. ప్రాణాలు కూడా కోల్పోయారని.. కానీ ఇప్పుడు దాని గురించి వేరే అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని వెట్రిమారన్ వ్యాఖ్యానించాడు.
ఈ రోజుల్లో ప్రతిదీ ప్రాపగండాగా మారిపోయిందని.. మన జ్ఞాపకాలను కూడా మార్చేసే ప్రభావం దానికి ఉంటుందని చెబుతూ.. డీమానిటైజేషన్‌ను ఉదాహరణగా చెప్పాడు వెట్రిమారన్. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ‘నీలిర’ లాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందని వెట్రిమారన్ అభిప్రాయపడ్డాడు.
ఆయన ‘దురంధర్’ పేరెత్తకపోయినా.. పాకిస్థాన్ ఫేక్ నోట్ల మాఫియా ఆట కట్టించడానికే మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా ‘దురంధర్’లో చూపించిన నేపథ్యంలో తన విమర్శలు ఏ సినిమా మీద అన్నది స్పష్టంగా అర్థమైపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates