సోమవారం వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానుల అంచనాలు కొంతమేర అందుకోగలిగాడేమో కానీ సాధారణ ప్రేక్షకులను చేరుకోలేకపోయాడు. మాములుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆసక్తి ఉంటుంది. కానీ ఈసారి అంత సీన్ కనిపించలేదు. దురంధర్ ది రివెంజ్ ప్రభావమని డిఫెండ్ చేసుకున్నా, దీని తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా విడుదలైన విషయాన్ని మర్చిపోకూడదు. ఫస్ట్ టూ డేస్ కూడా ఉస్తాద్ అద్భుతాలేం చేయలేదు.
ఇప్పుడు అసలైన సవాల్ వచ్చేసింది. వీకెండ్ అయిపోయింది. నిన్నటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఏదోలా బండి లాగింది. బుక్ మై షోలో ఎనభై వేల టికెట్లలంటే మంచి నెంబరే. కానీ హైదరాబాద్ లాంటి చోట్ల దురంధర్ రివెంజ్ చాలా స్పష్టంగా డామినేట్ చేయడాన్ని విస్మరించకూడదు. ఆక్యుపెన్సీలు ప్రమాదంలో పడటం గుర్తించిన ఏపీ బయ్యర్లు పది రోజులు పర్మిషన్లు ఉన్నా సరే ఇవాళ్టి నుంచే చాలా చోట్ల రెగ్యులర్ రేట్లకు టికెట్లను పెట్టేశారు. ఇది మంచి నిర్ణయం.
ఎందుకంటే ఒకపక్క దురంధర్ రివెంజ్ మాములు ధరలకు టికెట్లు దొరుకుతుంటే, టాక్ మిక్స్డ్ గా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కు వంద రూపాయలు అదనంగా పెట్టేందుకు జనాలు ముందుకు రారు. వీక్ డేస్ లో ఇది చాలా డేంజర్. గతంలో గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు లాంటివి ఎంత డిజాస్టర్ అయినా కనీస రెవిన్యూలు రాబట్టలేకపోవడానికి కారణం ఇదే. ఉస్తాద్ కు అంత దారుణమైన టాక్ లేకపోయినా పికప్ అవ్వాలంటే మాత్రం ముందు వాడాల్సిన ఆయుధం టికెట్ రేట్లే.
ఓవర్సీస్ లో వన్ మిలియన్ అయినా అందకుంటుందో లేదోననే అనుమానాల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ ఎదురీదుతున్నాడు. దురంధర్ తాకిడిని తట్టుకోవడం మహా కష్టంగా ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తన శాయశక్తులా వన్ మ్యాన్ ఆర్మీలా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నప్పటికీ వాటి ఫలితం మరీ గొప్పగా లేదన్న నిజాన్ని ఒప్పుకోవాలి. ఈ వారం కొత్త రిలీజులు అన్నీ చిన్న సినిమాలే కాబట్టి ఉస్తాద్ ఏమైనా పవన్ స్టామినాతో కొంచెం బెటర్ రికవర్ చేసుకుంటుందేమో చూడాలి. ఏప్రిల్ 3 శర్వానంద్ బైకర్ వచ్చేదాకా ఈ ఛాన్స్ ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates