పెద్ది బిజినెస్ టార్గెట్ అంత భారీగానా

ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం రేపడం, ట్రైలర్ రాకుండానే ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ వచ్చేయడం బయ్యర్లను టెంప్ట్ చేస్తున్నాయి. భారీ ఆఫర్లతో నిర్మాతల ముందుకు వస్తున్నారు. 2026లో అతి పెద్ద ఓపెనర్, రెవిన్యూ జనరేటర్ గా దీని మీద డిస్ట్రిబ్యూటర్ల అంచనాలు మాములుగా లేవు.

ట్రేడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు పెద్ది థియేటర్ బిజినెస్ సుమారు మూడు వందల కోట్ల దాకా చేరొచ్చట. నైజాం ఇంకా ఫైనల్ కానప్పటికీ 65 కోట్ల దాకా పలకొచ్చని అంటున్నారు. పెద్దిలో భాగస్వామ్యం ఉన్న మైత్రితో పాటు దిల్ రాజు, ఏషియన్ సునీల్ హక్కుల కోసం మంతనాలు సాగిస్తున్నట్టు వినికిడి. కర్ణాటక 23 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లు ఆల్రెడీ లాక్ చేసుకుని అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారట.

సీడెడ్ 35 కోట్ల దాకా, కోస్టల్ ఆంధ్ర 85 కోట్ల దాకా పలకొచ్చని అంటున్నారు. ఇంకా నార్త్ ఇండియా డీల్స్ మొదలవ్వలేదు. హిందీ ట్రేడ్ లో పెద్ది హాట్ కేక్ గా మారిపోయింది. పుష్ప రేంజ్ లో మేజిక్ చేస్తుందని నమ్ముతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే పెద్ద రేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక నాన్ థియేటర్, డిజిటల్, ఓటిటి, శాటిలైట్, ఆడియో హక్కులు కలుపుకుంటే నిర్మాత నేరుగా టేబుల్ ప్రాఫిట్స్ లో ఆల్రెడీ ఉన్నట్టే.

ఇది అధికారికంగా వెల్లడి చేసింది కాకపోయినా ఫిలిం సర్కిల్స్ టాక్ అయితే బలంగా ఉంది. కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో మన శంకరవరప్రసాద్ గారు మూడు వందల కోట్లు దాటినప్పుడు బహు భాషల్లో ఇంత హైప్ పెట్టుకుని పెద్ది ఇంకెంత మేజిక్ చేస్తుందోనని మెగా ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.

ఈ నెల రామ్ చరణ్ పుట్టినరోజు రానుంది. ట్రైలర్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అది బ్లాస్ట్ అయితేనే ఇక్కడ చేసిన డిస్కషన్ కి న్యాయం చేకూరుతుంది. ఐటెం సాంగ్, ప్యాచ్ వర్క్ తదితరాలు ఇంకా బాలన్స్ ఉన్నప్పటికీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని యూనిట్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.