పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. లాక్ డౌన్ ముంగిట చివరి దశలో ఉన్న వకీల్ సాబ్ సినిమాను పవన్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలోనే పవన్ వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ముందుగా గడ్డం లుక్‌తో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ సాగింది. కోర్టు నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్లన్నింటినీ పవన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. గడ్డం తీసి కొంచెం యంగ్‌గా తయారై వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు. త్వరలోనే శ్రుతి హాసన్ కూడా పవన్‌తో కలవనుంది. వారి మీద రొమాంటిక్ ట్రాక్ షూట్ చేస్తారట. అలాగే పాటల చిత్రీకరణ కూడా అవగొట్టి టాకీ పార్ట్ ముగిస్తారు.
వకీల్ సాబ్ సంగతి తేల్చగానే పవన్.. క్రిష్ సినిమా షూటింగ్ పునఃప్రారంభించనున్నాడు. మధ్యలో వచ్చిన విరామంలో వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్ సినిమాను పూర్తి చేసేసిన క్రిష్.. పవన్‌తో మధ్యలో ఆగిన సినిమాకు పక్కా షెడ్యూల్స్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథానాయికలు, ఇతర ప్రధాన నటీనటుల ఎంపిక త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్‌గా ఖరారవ్వగా.. రెండో హీరోయిన్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. పవన్‌కు దీటుగా నిలిచే విలన్ కోసం బాలీవుడ్ వైపే చూస్తున్నారట. ముందు సంజయ్ దత్ అనుకున్నారు కానీ.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని తీసుకోవడం కరెక్ట్ కాదని ఆగారు. ప్రస్తుతం అనిల్ కపూర్, సోనూ సూద్‌ల పేర్లను పరిశీలిస్తున్నారట. సోనూ అయితే తెలుగు ప్రేక్షకులకు రొటీన్ అవుతుందని.. అనిల్ అయితే భిన్నంగా ఉంటుందేమో అని క్రిష్ ఆలోచిస్తున్నాడట. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విలన్ పాత్రకు ఖరారవ్వచ్చని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates