సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఉస్తాద్ భగత్ సింగ్ తో పూర్తయిపోయాయి. నిర్మాత రామ్ తాళ్ళూరిది ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అయితే ఆయన ఇప్పటికిప్పుడు చేయమని ఒత్తిడి పెట్టడం లేదు. కాకపోతే దర్శకుడు సురేందర్ రెడ్డి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి వేగంగా షూటింగ్ చేసే సాధ్యాసాధ్యాలు ఉంటే చెప్పమని పవన్ ఆల్రెడీ ఈ టీమ్ తో మాట్లాడినట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ముందు అనుకున్న కథ ప్రకారం హైదరాబాద్, అమరావతిలోనే తీసే వీలు ఇందులో లేదట. అందుకే మార్పుల కోసం సూరి కొంత టైం అడిగినట్టు వినికిడి. ఇది పక్కనపెడితే పవన్ డేట్ల కోసం ప్రయత్నిస్తున్న నిర్మాతలు ఇంకా ఉన్నారు.
వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసేందుకు నిర్మాత దిల్ రాజు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఓజి నైజామ్ హక్కులు భారీ లాభాలు ఇవ్వడంతో మరింత కిక్ వచ్చేసింది. అయితే పవన్ అంత సులభంగా అంగీకారం తెలిపే పరిస్థితి లేదు. ఇంకో మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయి. కూటమిని మళ్ళీ అధికారికంలో తేవాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రిగా చివరి రెండు సంవత్సరాలు చాలా కీలకం. జనసేనని బలోపేతం చేసుకోవడం, ఎలక్షన్ల కోసం కార్యాచరణ, చంద్రబాబు ప్రభుత్వంతో మంతనాలు ఇలా సవాలక్ష వ్యవహారాలకు తోడు వివిధ శాఖలు, పిఠాపురం అభివృద్ధి ఇవన్నీ చూసుకోవాలి.
ఇంత టైట్ షెడ్యూల్ లో అసలు పవన్ కు సినిమాల గురించి ఆలోచించే ఓపిక తీరిక ఉండవు. అందుకే ఓజితోనే అభిమానులు తమ ఆకలిని పూర్తిగా తీర్చుకున్నారు. ఇకపై ఏది వచ్చినా బోనస్ గానే ఫీలవుతారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. అది కూడా హిట్టయితే పవన్ మీద మరింత ఒత్తిడి తోడవుతుంది. నటన కొనసాగించమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. సురేందర్ రెడ్డి కాకుండా ఓజి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తప్ప ఇంకేవి ఆయన మనసులో లేవని సన్నిహిత వర్గాల కథనం. ఇంకొంత కాలం ఆగితే తప్ప దీనికి సంబంధించిన క్లారిటీ రాదు. అప్పటిదాకా వెయిట్ చేయడమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates