ఓజీ… ఆ లోటును ఇప్పుడు తీర్చుకోవ‌చ్చు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లోనే అత్య‌ధిక హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒక‌టైన ఓజీకి రిలీజ్ ముంగిట స‌రైన ప్ర‌మోష‌న్లు జ‌ర‌గ‌లేద‌నే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కానీ, ద‌ర్శ‌కుడు సుజీత్ కానీ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు. క‌నీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్ట‌లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్ అయినా ఘ‌నంగా జ‌రుగుతుంద‌ని అనుకుంటే.. ఆ ఆశా తీర‌లేదు. ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేసిన‌ప్ప‌టికీ వ‌ర్షం, పూర్ ప్లానింగ్ వ‌ల్ల అది తేలిపోయింది. 

ఐతే సినిమాకు హైప్ ఉండ‌డం వ‌ల్ల ప్ర‌మోష‌న్లు, ప‌బ్లిసిటీ పెద్ద‌గా లేక‌పోయినా ఓపెనింగ్స్ విష‌యంలో ఇబ్బంది లేక‌పోయింది. ఐతే రిలీజ్ ముంగిట, రిలీజ్ టైంలో ఈ సినిమాను ప‌వ‌న్‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేయ‌లేక‌పోయామే అనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ఎన్న‌డూ లేని విధంగా త‌న చివ‌రి చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్ర‌మోష‌న్లకు మాత్రం ప‌వ‌న్ బాధ్య‌త‌గా హాజ‌ర‌య్యాడు. రిలీజ్ త‌ర్వాత కూడా స‌క్సెస్ మీట్‌లో కూడా పాల్గొన్నాడు. ఆ చిత్రానికి ప‌వ‌న్ అలా ప్రమోట్ చేయాల్సిన అవ‌స‌రం ప‌డింది. అభిమానులు అలా అయినా ఆయ‌న‌తో క‌నెక్ట్ అయ్యారు. 

కానీ వీర‌మ‌ల్లు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అభిమానుల‌కు పెద్ద‌గా సంతోషం మిగ‌ల్లేదు. ఓజీకి ఉన్న హైప్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ బాగా జ‌రిగి ఉంటే.. అభిమానుల సంతోషానికి అవ‌ధులు ఉండేవి కావు. ఇప్పుడు ఈ సినిమా స‌క్సెస్‌ను కూడా ప‌వ‌న్‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోలేక‌పోతున్నామ‌నే బాధ వారిలో ఉంది. వీర‌మ‌ల్లు కోసం వ‌చ్చిన‌ట్లు ఈ సినిమా స‌క్సెస్ ప్రెస్ మీట్లో కూడా ప‌వ‌న్ పాల్గొని ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఐతే జ్వ‌రంతో బాధ ప‌డుతున్న ప‌వ‌న్ ఇందులో పాల్గొన‌లేదు. ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నా స‌రే ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చేవాడా అన్న‌ది సందేహ‌మే. 

కానీ ఆ ఆశ తీర‌క‌పోయినా.. అభిమానుల‌తో క‌లిసి త‌న ఆనందాన్ని పంచుకోవ‌డానికి ప‌వ‌న్ త్వ‌ర‌లోనే రాబోతున్నాడు. ఇంకో నాలుగైదు రోజుల్లో ఓజీ స‌క్సెస్ మీట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నార‌ట‌. ప‌వ‌న్ స‌హా టీం అంతా అందులో పాల్గొని ఓజీ స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేయ‌బోతున్నారు. అది అభిమానుల‌కు పండుగ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.