వకీల్‍ సాబ్‍ నోట్లో పంచదార!

రోజులో ఎన్ని షోలయినా వేసుకోవచ్చని, అలాగే టికెట్‍ ధర ఆయా సినిమా డిమాండ్‍కి తగ్గట్టుగా ఎంతయినా పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‍ ఇచ్చేసింది. త్వరలోనే ఏపీ గవర్నమెంట్‍ కూడా ఇదే ఉత్తర్వులు ఇస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. అయితే ఈ పెరిగిన టికెట్‍ రేట్లు చిన్న సినిమాలకు, మీడియం రేంజ్‍ సినిమాలకు ఏమంత ఉపయోగపడవు. అలాంటి చిత్రాలకు రేట్లు పెంచి అమ్మితే వచ్చే ప్రేక్షకులను స్వయంగా వెనక్కు పంపేసినట్టు అవుతుంది. ఈ పక్రియలో ముందుగా లాభపడే పెద్ద సినిమా వకీల్‍ సాబ్‍ అవుతుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని దిల్‍ రాజు చూస్తున్నాడు.

సంవత్సరం తర్వాత రిలీజ్‍ అయ్యే పెద్ద సినిమా కావడం, అది కూడా పవన్‍ కళ్యాణ్‍ మూడేళ్ల తర్వాత తెరపై కనిపించే సినిమా కావడంతో వకీల్‍ సాబ్‍కు ఓపెనింగ్స్ పరంగా ఢోకా వుండదు. ఇప్పుడు రేట్లు కూడా బాగా పెంచుకోవచ్చు కాబట్టి ఇది దిల్‍ రాజుకి శుభవార్త. ఈ చిత్రానికి బడ్జెట్‍ కరోనా బ్రేక్‍కి ముందు వేసుకోగా, ఇప్పటి పరిస్థితుల్లో అది వర్కవుట్‍ అవడం లేదని దిల్‍ రాజు మల్లగుల్లాలు పడుతున్నాడు. ఈ టైమ్‍లో ఈ వార్త రావడంతో దిల్‍ రాజు మరోసారి లక్కీ రాజు అనిపించుకున్నాడు. వి సినిమాను లాక్‍డౌన్‍లో అమెజాన్‍ ద్వారా విడుదల చేసేసి దిల్‍ రాజు లాభపడిన సంగతి తెలిసిందే. అంత పెద్ద సినిమాను ఓటిటిలో విడుదల చేయడమేంటని అన్నవాళ్లే తెలివైన పని చేసాడని తర్వాత మెచ్చుకున్నారు.