కాంతారను వెంటాడుతున్న ప్రమాదాలు

మురారిలో మహేష్ బాబు కుటుంబాన్ని తరాల వెంబడి అమ్మవారి శాపం విపత్తులు తెచ్చిన తరహాలో కాంతార చాప్టర్ 1 బృందం సైతం అదే రీతిలో అష్టకష్టాలు పడుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రం శివమొగా జిల్లా మణి జలాశయంలో ప్రయాణం చేస్తుండగా హఠాత్తుగా బోటు తిరగబడి అందరూ నీటిలో పడిపోయారని, హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 సభ్యులు ఈత రావడంతో క్షేమంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని వార్తలొచ్చాయి.. కానీ గాలివానకు వేసిన సెట్ కూలిపోవడం తప్ప ఎలాంటి ప్రమాదం జరగలేదని హోంబాలే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. ఇది నిజం కాకపోవడం సంతోషమే అయినా కాంతారా టెన్షన్ వేరే ఉంది.

షూటింగ్ మొదలైనప్పటి నుంచి కాంతార చాప్టర్ 1 కు ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్న నవంబర్ లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్ కు యాక్సిడెంట్ అయ్యింది. అంతకు ముందు కపిల్ అనే నటుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. రాకేష్ పూజారి అనే మరో యాక్టర్ గుండెపోటుతో మృతి చెందడం కన్నడ పరిశ్రమను షాక్ కు గురి చేసింది. ఇతనిది చిన్న వయసు. కొద్దిరోజుల క్రితం కళాభవన్ విజు అనే మిమిక్రీ ఆర్టిస్ట్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్టు శాండల్ వుడ్ టాక్. బెంగళూరు శివారులో అడవిని కొట్టేశారని స్వయంగా ప్రభుత్వం వేసిన కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది.

2022లో రిలీజైన కాంతార బ్లాక్ బస్టర్ సాధించాక ఈసారి పెద్ద మొత్తం బడ్జెట్ కేటయించి చాప్టర్ 1 నిర్మిస్తున్నారు. అయితే దక్షిణ కన్నడ దేవుళ్ళ మీద సినిమాలు తీసి కమర్షియల్ గా డబ్బులు సంపాదించాలనుకునే ప్రయత్నాలు మంచివి కావని రామదాస్ పూజారి అనే థియేటర్ ఆర్టిస్ట్ చెప్పినట్టు వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. మంగళూరులో జరిగే కద్రి బరేబైల్ పండక్కు రిషబ్ హాజరైనప్పుడు తన చుట్టూ శత్రువులు ఉన్నారని పంజుర్లీ పూనిన వ్యక్తి చెప్పడం సెన్సేషన్ అయ్యింది. అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతున్న కాంతారా చాప్టర్ 1కు ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో, ఇంకేమేం పరిణామాలు చవి చూడాలో.